Published : 05/12/2021 04:51 IST

అమరావతిపై సీఎం మౌనం వీడాలి

భాజపా రాష్ట్ర కార్యవర్గం డిమాండ్‌

భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి మురళీధరన్‌.

చిత్రంలో నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేష్‌,

శివప్రకాశ్‌ జీ, సోము వీర్రాజు, పురందేశ్వరి, సత్యకుమార్‌, టీజీ వెంకటేష్‌ తదితరులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై ఇంతకు ముందు తీసుకొచ్చిన చట్టాలను ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టి, ఎటూ తేలని పరిస్థితిలోకి నెట్టిందని భాజపా రాష్ట్ర శాఖ పేర్కొంది. ఇప్పుడు దీనిపై ఒక్కో మంత్రి ఒక్కోలా వ్యాఖ్యానిస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించింది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేదా అనే అంశంపై సీఎం జగన్‌ మౌనం వీడాలని డిమాండ్‌ చేసింది. శనివారం విజయవాడలో జరిగిన భాజపా కార్యవర్గ సమావేశంలో రాజకీయ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై రెండు తీర్మానాలు చేసింది. ‘ప్రభుత్వం రాజధాని రైతులతో చర్చలు జరిపి పరిష్కరించకుండా.. పాదయాత్ర చేసే వారిని అడ్డుకోవడం దారుణం. అమరావతి రాజధాని పేటెంట్‌ భాజపాకు మాత్రమే ఉంది. కేంద్రం బీసీల గణనకు అవకాశం కల్పిస్తే వైకాపా ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. ప్రభుత్వ పనితీరును తప్పుబడితే.. ప్రతిపక్షాలపై దాడులకు దిగుతోంది. వ్యక్తిగత విమర్శలతో దాడికి దిగుతున్న రాష్ట్ర సర్కారుపై భాజపా ప్రజాయుద్ధం ప్రకటిస్తోంది. అన్ని పథకాలకు వివిధ సాకులతో కోతపెట్టి పేదలు, మహిళలు, వృద్ధులను మనోవేదనకు గురిచేయడాన్ని అధికార పార్టీ మానుకోవాలి. అన్యమతాలకు సంబంధించిన పాఠాలను ప్రాథమిక విద్యలో చేర్పించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలోని దేవాలయాల ఆస్తుల జాబితా బహిర్గతం చేయాలి’ అని రాజకీయ తీర్మానంలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అప్పులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆర్థిక తీర్మానంలో పేర్కొంది. ‘15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే పంచాయతీలకు విడుదల చేయాలి. సర్పంచుల ద్వారానే వాటి వ్యయం జరిగేలా చూడాలి. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేసి, అందరికీ ఇంటి పట్టాలు ఉచితంగా అందజేయాలి. ఉద్యోగుల పీఆర్సీని, సీపీఎస్‌ రద్దు హామీని అమలు చేయాలి’ అని డిమాండ్‌ చేసింది. 

జగన్‌ పోస్ట్‌మాన్‌ మాత్రమే: మురళీధరన్‌

ప్రధాని మోదీ మనియార్డర్‌ పంపితే పోస్ట్‌మాన్‌గా ఉన్న సీఎం జగన్‌ డబ్బులు తానిచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి మురళీధరన్‌ విమర్శించారు. ఈ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ..‘అధికార పార్టీ నేతలు ఇసుక దందా కోసం.. అధికారులు చర్యలు తీసుకోకుండా చేతులు కట్టేశారు. అందువల్లే కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు దెబ్బతింది’ అని ఆరోపించారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులపై బహిరంగ చర్చకు రావాలని ఆర్థిక మంత్రికి సవాల్‌ విసిరారు. సమాజం పట్ల అంకితభావం కలిగిన వారిని పార్టీలో చేర్చుకోవాలని అఖిల భారత సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్‌జీ అన్నారు. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, కార్యదర్శి సత్యకుమార్‌, ఎమ్మెల్సీ మాధవ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

* ఇటీవల పార్టీ ప్రకటించిన రాష్ట్ర కోర్‌ కమిటీలో ఓ ప్రధాన సామాజికవర్గాన్ని విస్మరించడం ఎంతవరకు సమంజసమని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు. పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్‌ కమిటీలో సభ్యుల సంఖ్యను పెంచైనా అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులున్న ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం కల్పించాల్సి ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు సమావేశంలో చర్చనీయాంశమయ్యాయి.

నిజాలు చెబితే కేంద్ర మంత్రిపైనా నిందలేస్తారా? 

మంత్రి అనిల్‌పై భాజపా ఎంపీల ధ్వజం

అధికార పార్టీలో కొంతమంది తమకు భాజపా ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారని, దానిలో ఇసుమంత కూడా నిజం లేదని భాజపా రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయిన ఘటనలో వాస్తవాలను వివరించిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌పై రాష్ట్ర మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. విజయవాడలో శనివారం పార్టీ కార్యవర్గ సమావేశం సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడారు.అన్నమయ్య ప్రాజెక్టుపై వాస్తవాలను వివరించినందుకు షెకావత్‌పై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెడతారా? అని సీఎం రమేష్‌ ప్రశ్నించారు. ఈ విషయంలో మంత్రులు బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.‘అన్నమయ్య ప్రాజెక్టు ముప్పు మానవ తప్పిదం, బాధ్యతారాహిత్యమే. నేనే ముందుగా ప్రాజెక్టు వద్దకు వెళ్లాను. భాజపా ముందస్తు హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదు. కడప జిల్లా కలెక్టర్‌ కూడా సరిగా స్పందించలేదు’ అని పేర్కొన్నారు. సుజనాచౌదరి మాట్లాడుతూ ‘వైకాపా వారిని మేం రాజకీయ శత్రువులు అనం. కానీ వారు మాకు రాజకీయ ప్రత్యర్థులు. మూడు రాజధానుల బిల్లులను ఎందుకు ప్రవేశపెట్టారో.. ఎందుకు ఉపసంహరించుకున్నారో అర్థం కావడం లేదు. పోలవరం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంగా వ్యవహరిస్తోంది. ఇవన్నీ కేంద్రానికి చెప్పి చేస్తున్నామని కొందరు వైకాపా నేతలు అసత్యప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. షెకావత్‌ వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర ఉందని మంత్రి అనిల్‌కుమార్‌ ఆరోపణలు చేయడంపై రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ మండిపడ్డారు. ‘తప్పు జరిగింది, మళ్లీ జరగకుండా చూస్తామని చెప్పాల్సిన రాష్ట్ర మంత్రి.. రాజకీయం అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదు. కిందటి ఎన్నికల్లో భాజపా తెదేపాను పడగొట్టాలని చూసిందే కానీ.. రాజ్యాధికారం గురించి ఆలోచించలేదు. ఇక రాజ్యాధికారం కోసమే కృషి చేస్తాం’ అని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకువెళ్తోందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని