
లేఅవుట్లలో 5% స్థలం కేటాయింపునిర్ణయం పెద్ద కుంభకోణం
తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం
ఈనాడు, అమరావతి: లేఅవుట్లలో 5 శాతం స్థలాన్ని స్థిరాస్తి వ్యాపారులు ప్రభుత్వానికి కేటాయించాలన్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి వర్గాలపై ఏటా రూ. కోట్లలో భారం పడుతుందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వ్యాపారులు తమ జేబుల్లో నుంచి ఈ మొత్తం ఇచ్చే అవకాశం లేనందున కొనుగోలుదారులైన పేద, మధ్య తరగతిపైనే ఈ భారం పడుతుంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను ఒక వైపున అమ్మకానికి పెట్టి...మరోవైపున నోటిఫికేషన్లు ఇస్తూ ఇంకా భూమి కావాలనడం దేనికి? ఇదివరకు తీసుకున్న 68 వేల ఎకరాలనే పేదలకు ఇంకాసరిగా పంచలేదు...’ అని ఆయన పేర్కొన్నారు. పేదలకోసం ప్రభుత్వ భూమి ఇస్తే తెదేపా కూడా స్వాగతిస్తుందని, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకం వెనుక కుంభకోణం ఉంటోందని ఆరోపించారు. సీఎంకు అత్యంత ఆప్తులైన అరబిందో, రాంకీ, ఇందూ వంటి సంస్థలు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయని.. వారికి మేలు చేసేందుకు ఏపీలోని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని పట్టాభిరాం ఆరోపించారు.