ప్రొద్దుటూరు వైకాపాలో ఫ్లెక్సీల రగడ

కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ల మధ్య అంతర్గతపోరు మరోసారి రచ్చకెక్కింది.  ఈ నెల 16న ఎమ్మెల్సీ

Published : 15 Jan 2022 04:12 IST

ఈటీవీ- కడప, న్యూస్‌టుడే- ప్రొద్దుటూరు నేరవార్తలు: కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ల మధ్య అంతర్గతపోరు మరోసారి రచ్చకెక్కింది.  ఈ నెల 16న ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన అనుచరులు ప్రొద్దుటూరు పట్టణంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలాచోట్ల ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి చిత్రం లేదు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీరాములపేటలో ఎమ్మెల్సీ వర్గీయులు ఫ్లెక్సీలు కడుతుండగా పదో వార్డు కౌన్సిలర్‌ గరిశపాటి లక్ష్మీదేవి, ఆమె అనుచరులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఫొటో లేని ఫ్లెక్సీ ఇక్కడ కట్టొద్దన్నారు. మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్సీ అనుచరుడు రఘునాథ్‌రెడ్డితో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో కౌన్సిలర్‌ లక్ష్మీదేవి ఆమె భర్త మరికొందరు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తనపై దాడి జరిగిందని రఘునాథ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ సంఘటానికి స్థలానికి వచ్చారు. పోలీసులు ఆయన్ను వారించి వెనక్కి తీసుకెళ్లారు. రమేష్‌ యాదవ్‌ తుపాకీతో తనను బెదిరించారని కౌన్సిలర్‌ లక్ష్మీదేవి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు రమేష్‌ యాదవ్‌ కడపలో ఎస్పీ అన్బురాజన్‌ కలిసి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆయన వెళ్లిన కాసేపటికి పదో వార్డు కౌన్సిలర్‌ లక్ష్మీదేవి, పద్మశాలి కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి ఎస్పీని కలిశారు. రమేష్‌ యాదవ్‌పై ఫిర్యాదు చేశారు. కాగా ప్రొద్దుటూరు వైకాపాలో ఎలాంటి విబేధాలు లేవని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను, రమేష్‌ యాదవ్‌ బాగానే ఉన్నామని చెప్పారు. ఫ్లెక్సీల వివాదం సమయంలో కౌన్సిలర్‌పై తాను తుపాకీ గురిపెట్టాననడం అవాస్తవమని ఎమ్మెల్సీ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని