Published : 22 Jan 2022 05:07 IST

భద్రతా వైఫల్యంతోనే దాడులు

మాపై నిర్బంధం.. వారికి సహకారం

పోలీసుల తీరు ఏకపక్షం: తెదేపా నేతలు

ఈనాడు, అమరావతి: గుడివాడలో తెదేపా కార్యకర్తలపై వైకాపా వర్గాల దాడి ఘటన వ్యవహారంలో పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. పోలీసులు అధికార పార్టీతో కుమ్మక్కయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. భద్రతా చర్యలు తీసుకోవడంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. తెదేపా నేతలపై నిర్బంధం అమలు చేసి.. అధికార పార్టీ కార్యకర్తలను మాత్రం యథేచ్ఛగా పట్టణంలోకి అనుమతించడం విమర్శలకు తావిచ్చింది. ఒకవైపు తెదేపా నేతలను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు.. మరోవైపు వైకాపా కార్యకర్తలకు ఎలాంటి షరతులు విధించకపోవడంతో పక్షపాతంగా వ్యవహరించారన్న ఆరోపణలకు బలం చేకూరుతున్నాయి. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగడం, పోలీసు చూస్తుండగానే కారు ధ్వంసం చేయడం, పోలీసు ఎదురుగానే తెదేపా కార్యకర్తపై వైకాపా కార్యకర్త ఒకరు ముష్టిఘాతాలకు దిగి రక్తం కారేలా దాడులు చేయడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. అధికార పార్టీకి కొమ్ముకాశారని తెదేపా నాయకులు తీవ్రంగా ఆరోపించారు. కె-కన్వెన్షన్‌లో అప్పటికప్పుడు అత్యవసరంగా గుడివాడ నియోజకవర్గం వైకాపా ఎస్సీ సెల్‌ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దానికోసం వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. వారు ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీలు నిర్వహిస్తూ.. కొడాలి నాని జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తూ కె-కన్వెన్షన్‌కు, తెదేపా కార్యాలయానికి చేరుకున్నారు.

అడుగడుగునా అడ్డంకులు

తెదేపా నిజనిర్ధారణ కమిటీ వస్తుందన్న సమాచారంతో వారిని అడ్డగించేందుకు పోలీసులు మోహరించారు. ముందుగా కంకిపాడు మండలం దావులూరు వద్దే అడ్డగించారు. ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని, అందుకే మారణాయుధాలు ఉన్నాయేమోనని సోదాలు చేస్తున్నామని నేతలకు ఓ అధికారి చెప్పడం విశేషం. తర్వాత గుడివాడ-పామర్రు క్రాస్‌రోడ్డు వద్ద వాహనాలు అడ్డగించారు. తెదేపా నేతలకు ఇలా షరతులు విధిస్తూ.. వైకాపా కార్యకర్తలు సులభంగా చేరుకునేలా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. 8మంది డీఎస్పీలు, పదుల సంఖ్యలో సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఉన్నా.. అంతా ఏకపక్షంగా మారింది. ప్రణాళిక ప్రకారం వైకాపా కార్యకర్తలు తెదేపా కార్యాలయానికి సమీపానికి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోలేదు.

తెదేపా పైనే కేసులు!

వైకాపా కార్యకర్తల దాడుల్లో తెదేపా కార్యకర్తలు గాయపడితే తెదేపా నాయకులపైనే కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెదేపా నాయకులు పామర్రు పోలీసుస్టేషన్‌లో చేసిన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు గురవుతోంది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని