Raghurama: బుజ్జగించడానికి బుగ్గన... నమ్మించడానికి నాని: రఘురామ

పీఆర్సీపై ఉద్యోగులను బుజ్జగించడానికి బుగ్గన, నమ్మించడానికి నాని, సర్దిచెప్పడానికి సమీర్‌శర్మ, సర్దుకోమనడానికి సజ్జల, బెదిరించడానికి బొత్సతో కమిటీ వేశారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. శనివారం దిల్లీలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ...

Published : 23 Jan 2022 07:11 IST

అందుకే ఉద్యోగులతో చర్చలకు కమిటీ

ఈనాడు, దిల్లీ: పీఆర్సీపై ఉద్యోగులను బుజ్జగించడానికి బుగ్గన, నమ్మించడానికి నాని, సర్దిచెప్పడానికి సమీర్‌శర్మ, సర్దుకోమనడానికి సజ్జల, బెదిరించడానికి బొత్సతో కమిటీ వేశారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. శనివారం దిల్లీలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ... రెండు నెలలు జీతాలు ఇవ్వకపోతే వారే దారికి వస్తారని ఉద్యోగులను అవమానించేలా కొందరు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కానీ... రెండు నెలలు జీతాలు ఇవ్వకపోతే ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడుతుందని, దాంతో కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనవసర ప్రకటనలు, తప్పుడు సమాచారంతో ప్రజలు, ఉద్యోగులకు మధ్య అగాధం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రఘురామకృష్ణ ఎద్దేవా చేశారు. ముందు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని మెరుగుపరిచి తర్వాత విమానాశ్రాయాల గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ బండి సంజయ్‌ విషయంలో ఒకలా, నా విషయంలో మరోలా వ్యవహరించడం న్యాయమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో కొడాలి నానికి సంబంధం లేదని అనుకుంటున్నానని, అయితే అసలు వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందన్నదానిపై విచారణ జరిపించాలన్నారు.
సైకోలెవరో విజయసాయిరెడ్డి చెప్పాలి

‘‘గత రెండు రోజులుగా విజయసాయిరెడ్డి చాలా వికారాలు పోతున్నారు. నాకు ఏదో పాంపోఫోబియా ఉందన్నారు. దానిపై ప్రముఖ సైకాలజిస్టు సుధాకర్‌రెడ్డి ఒక విశ్లేషణ ఇచ్చారు. రాత్రిళ్లు ఆత్మలు కనిపించడం, భ్రమలు, భ్రాంతులకు గురవడం, ఎదుటపడిన వారిని కొట్టి గాయపరచడం, ఇతరులను హింసించి సంతోషించడం, ఇంట్లోని వస్తువులను పగులగొట్టడం సైకోల లక్షణాలని డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి చెప్పినట్లు గుర్తుచేశారు. ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో విజయసాయిరెడ్డికి తెలిస్తే సుధాకర్‌రెడ్డికి చెప్పాలి’’ అని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. వివేకా హత్యకేసులో సమాజంలో ప్రతిష్ఠ ఉన్న వారిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నందున విచారణను ఆపేయాలని జగన్‌ న్యాయవాది హైకోర్టులో వాదించడం విచిత్రంగా ఉందన్నారు. ఏ కేసులోనైనా హత్యచేసిన వారికంటే దాన్ని ఎవరు చేయించారన్నదే ముఖ్యమని, కానీ ఇక్కడ మాత్రం సమాజంలో పరపతి ఉన్న వారిని ఇందులో ఇరికించాలని చూస్తున్నట్లు ఆ న్యాయవాది ఎలా ఊహించి చెప్పారో బహిర్గతం చేయాలని కోరారు. చిరంజీవి ముఖ్యమంత్రి ఇంటికి భోజనానికి వచ్చినట్లు తేలిగ్గా మాట్లాడిన మంత్రి పేర్నినాని క్షమాపణలు చెప్పాలన్నారు. వారం రోజుల్లో రాజీనామా చేస్తానన్న తాను చేయడం లేదని చర్చపెట్టారని, అయితే వైకాపా నాయకులు తనను డిస్‌క్వాలిఫై చేయిస్తానని చెప్పడంతోనే వేచిచూశానని, వారికి ఆ పని చేతకాదని చెబితే ఇప్పుడే రాజీనామా చేస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని