AP News: మంత్రి కొడాలి నానిపై కార్యకర్తలే తిరగబడతారు:సుబ్బారావు గుప్తా

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మంత్రి కొడాలి నాని వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందని, అతని వ్యాఖ్యలతో వైకాపాకు తీవ్రనష్టం వాటిల్లుతోందని ఆ పార్టీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావుగుప్తా అభిప్రాయపడ్డారు.

Published : 24 Jan 2022 07:14 IST

 ఆయనపై సీఎం చర్యలు తీసుకోవాలి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మంత్రి కొడాలి నాని వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందని, అతని వ్యాఖ్యలతో వైకాపాకు తీవ్రనష్టం వాటిల్లుతోందని ఆ పార్టీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావుగుప్తా అభిప్రాయపడ్డారు. ఒంగోలు ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారన్న తెదేపా ఆరోపణల్లో నిజం లేకపోతే, ఆ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పరిశీలిస్తే మంత్రి నానికి వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. చంద్రబాబును ఉద్దేశించి నోటికొచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదన్నారు. ‘కొందరు నాని వ్యాఖ్యలకు సంతోషిస్తున్నప్పటికీ, అత్యధిక శాతం చీదరించుకుంటున్నారు. ఈ తరహా వ్యాఖ్యలతో రానున్న ఎన్నికల్లో వైకాపా నష్టపోతుందనేదే ఎక్కువ మంది మనోగతం. నాని ఇదే తరహా వ్యాఖ్యలు కొనసాగిస్తే కార్యకర్తలే ఆయనపై తిరగబడే అవకాశం ఉంది. మంత్రిపై సీఎం జగన్‌ చర్యలు తీసుకోకుంటే, అతను ఇవే వ్యాఖ్యలు కొనసాగిస్తే నేను వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేస్తాన’ని గుప్తా ప్రకటించారు. ఒంగోలులోని తన ఇంటిపై దాడిచేసిన వ్యక్తులపై ఇంతవరకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకోలేదని వాపోయారు. తాను గుంటూరులో ఉన్న విషయాన్ని ఒంగోలు డీఎస్పీ నాగరాజు వారికి తెలిపి, దాడికి కారకుడయ్యాడని ఆరోపించారు. మంత్రి బాలినేని కుమారుడు ప్రణీత్‌రెడ్డి ఒంగోలులో మాఫియా నడుపుతుంటే, అవేమీ తెలియనట్టు తండ్రి నటిస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని