విద్వేషాలను రెచ్చగొట్టే నిందితుడిని కేంద్రమంత్రి పరామర్శించడమేంటి?

‘మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు కాలు దువ్వి, రౌడీయిజం చేసిన నిందితుడిని జైలులో పరామర్శించడానికి బాధ్యత కలిగిన కేంద్రమంత్రి రావడం అంటే రాష్ట్రాన్ని భాజపా వారు ఏం చేయదలచుకున్నారు’ అని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

Published : 25 Jan 2022 02:53 IST

మంత్రి పేర్ని నాని ధ్వజం

ఈనాడు, అమరావతి: ‘మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు కాలు దువ్వి, రౌడీయిజం చేసిన నిందితుడిని జైలులో పరామర్శించడానికి బాధ్యత కలిగిన కేంద్రమంత్రి రావడం అంటే రాష్ట్రాన్ని భాజపా వారు ఏం చేయదలచుకున్నారు’ అని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి కేంద్ర మంత్రి జైలుకు రావడమంటే రాజకీయ వ్యవస్థను భాజపా ఏ విధంగా దిగజారుస్తోందో తెలుస్తోందని విమర్శించారు. ‘రాజకీయ అవసరాల కోసం వారి పాలనలో లేని రాష్ట్రాలను రావణకాష్ఠంలా మార్చేందుకు ఇది వారి ప్రయత్నమా’ అని ప్రశ్నించారు. సోమవారం మరో మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ఈ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని అక్కడే విలేకరులతో మాట్లాడుతూ కేంద్రమంత్రి మురళీధరన్‌ కడపలో సోమవారం చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందించారు. ‘దేశ వ్యతిరేక శక్తులను పుట్టించే ప్రాంతంగా ఏపీ మారిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మీ వ్యాఖ్యలే నిజమైతే ఎన్‌ఐఏ, రా, ఐబీ వంటి కేంద్ర సంస్థలు నిద్రపోతున్నాయా’ అని వ్యాఖ్యానించారు.


వివరాలు తెలుసుకుంటే బాగుండేది: హోం మంత్రి  

గుంటూరు, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా ఆత్మకూరులో మతవిద్వేషాలను రెచ్చగొట్టి, అల్లర్లకు కారణమైన వ్యక్తిని కేంద్ర మంత్రి మురళీధరన్‌ జైలుకెళ్లి పరామర్శించడం విస్మయపర్చిందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి ముందుగా ఆత్మకూరులో జరిగిన సంఘటన వివరాలు తెలుసుకుంటే బాగుండేదని పేర్కొన్నారు. చిత్తూరులో ఎస్సీ మహిళ ఉమామహేశ్వరిపై పోలీసులు దురుసుగా వ్యవహరించారన్న ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని