రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది

సీఎం జగన్‌ అసమర్థతతో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి, భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మురళీధరన్‌ విమర్శించారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న కర్నూలు జిల్లా భాజపా

Published : 25 Jan 2022 02:53 IST

శాంతిభద్రతలు కాపాడటంలో జగన్‌ సర్కారు విఫలం
భాజపా కార్యకర్తలపై దాడులు సహించం
కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్‌ స్పష్టీకరణ

ఈనాడు డిజిటల్‌, కడప, నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ అసమర్థతతో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి, భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మురళీధరన్‌ విమర్శించారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న కర్నూలు జిల్లా భాజపా నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిని సోమవారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం జగన్‌ పాలనపై దృష్టిపెట్టకపోవడంతో వైకాపా నేతలు రాష్ట్రంలో రెచ్చిపోతున్నారు. సీఎం స్వయంగా ప్రభుత్వంలో అక్రమాలకు తెరలేపడంతో పాటు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది. శాంతిభద్రతల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆత్మకూరులో పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసినవారిని వదిలిపెట్టి శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు పెట్టారు. ఆయనను చంపేందుకు కుట్రపన్నారు’ అని ఆరోపించారు. ‘భాజపా ఏ మతానికి వ్యతిరేకం కాదు.. కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం’ అని కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్‌ అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘శ్రీకాంత్‌రెడ్డిపై జరిగిన దాడి అప్రజాస్వామికం. భాజపా నాయకులను అణచివేయాలని చూస్తే వందలాది మంది కార్యకర్తలు పుట్టుకువస్తారు’’ అని అన్నారు. అంతకుముందు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి, సృజన్‌ సింగ్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కార్యక్రమాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్‌, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని