పంజాబ్‌లో పద్మవ్యూహం ఫలిస్తుందా?

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. పొరుగునే ఉన్న పంజాబ్‌లో మాత్రం సవాళ్లను అధిగమించలేకపోతోంది. ఇక్కడ అధికారం అందని ద్రాక్షగానే ఉంది. ఈసారి కచ్చితంగా అధికార పీఠమెక్కాల్సిందేనన్న పట్టుదలతో

Updated : 28 Jan 2022 05:18 IST

సిక్కుల సంఘీభావం లభించేనా!

చిరకాల స్వప్న సాకారానికి భాజపా యత్నం

చండీగఢ్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. పొరుగునే ఉన్న పంజాబ్‌లో మాత్రం సవాళ్లను అధిగమించలేకపోతోంది. ఇక్కడ అధికారం అందని ద్రాక్షగానే ఉంది. ఈసారి కచ్చితంగా అధికార పీఠమెక్కాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న కమల దళం ఏ వ్యూహంతో ముందుకెళ్తోంది... సాగు చట్టాలతో వచ్చిన వ్యతిరేకతను ఎలా అధిగమిస్తుంది? ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా పొత్తులు, ఎత్తులు ఎలా ఉండబోతున్నాయన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. పంజాబ్‌ ఎన్నికల్లో గెలుపుపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తరవాత భాజపా అంతే ధీమాగా ఉంది. కానీ, రాష్ట్రంలో ఆ పార్టీ స్థితిగతులు చూస్తే పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించటం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఈ రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో పుంజుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యేక కసరత్తులు ప్రారంభించింది. విజయమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, శిరోమణి అకాలీ దళ్‌(సంయుక్త్‌) నేత దిండ్సాతో పలు దఫాల చర్చలు తర్వాత సీట్ల పంపకానికి ఇటీవలే తుదిరూపు ఇచ్చారు. భాజపా 65 సీట్లలో పోటీ చేస్తుండగా.. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌కు 37 స్థానాలు కేటాయించారు. శిరోమణి అకాలీ దళ్‌(సంయుక్త్‌) పార్టీకి 15 సీట్లు ఇచ్చారు.

సాగు చట్టాల రద్దే ప్రచారాస్త్రం..
శిరోమణి అకాలీదళ్‌తో చాలా కాలం కలసి నడిచిన భాజపా.. ఇప్పుడు వేరైపోయింది. వారితో పొత్తు లేకున్నా తమకు ఎలాంటి నష్టం ఉండదని ఘాటుగానే బదులిస్తోంది. కానీ సాగు చట్టాలపై వచ్చిన వ్యతిరేకతతో కమల దళానికి నష్టం తప్పదనే మాట అంతటా వినిపిస్తోంది. ఆ పార్టీ మాత్రం.. ఇదే మాత్రం నష్టం చేకూర్చదన్న విశ్వాసంతో ఉంది. పైగా.. రైతుల శ్రేయస్సు కోసమే ప్రధాని మోదీ సాగు చట్టాలు రద్దు చేశారని ప్రచారం చేస్తోంది. రైతుల సంక్షేమ అజెండాతో బరిలోకి దిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

సిక్కులను ఆకట్టుకునే వ్యూహాలు..
హిందుత్వ పార్టీగా ముద్ర పడిపోయిన భాజపా.. సిక్కులను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకే ఈ ఎన్నికల్లో సిక్కులనే పోటీలో నిలిపే వ్యూహంతో ముందుకొచ్చింది. రైతు చట్టాలతో వచ్చిన వ్యతిరేకతనూ ఈ వ్యూహంతో అధిగమించాలని చూస్తోంది. అకాలీ దళ్‌కు చెందిన సిక్కు నేతలను తన వైపు తిప్పుకుని ప్రచారంలో దూకుడుగా వ్యవహరించేందుకు పావులు కదుపుతోంది. శిరోమణి అకాలీ దళ్‌కు చెందిన కీలక నేత మంజీందర్‌ సింగ్‌ సిర్సా ఇప్పటికే భాజపా కండువా కప్పుకున్నారు. అఖిల భారత సిక్కు విద్యార్థుల సమాఖ్యకు నేతృత్వం వహిస్తున్న కీలక నేత హరీందర్‌ సింగ్‌ కహ్లోన్‌ కూడా కమలం పార్టీలో చేరారు. 1980 నుంచి క్షేత్రస్థాయిలో పలు ఉద్యమాల్లో పాల్గొన్న హరీందర్‌ సింగ్‌కు ప్రజల్లో మంచి మద్దతు ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. పంజాబ్‌లో హిందువులు 38 శాతంగా ఉన్నారు. కీలకమైన అంశం ఏమిటంటే...సాగుచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో హిందువుల సంఖ్య భారీగానే ఉంది. అయితే..ఈ చట్టాలను రద్దు చేయటం వల్ల ఈ వర్గం తమకు మద్దతుగానే నిలుస్తుందని భావిస్తోంది భాజపా.

నయా పంజాబ్‌ నినాదంతో..
పంజాబ్‌ శాసనసభ ఎన్నికలకు ‘భాజపాతో నయా పంజాబ్‌’ అనే నినాదాన్ని ఇప్పటికే కాషాయ పార్టీ నేతలు ప్రకటించారు.  సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని అప్పుడే తెలిపింది. ఇసుక, డ్రగ్స్‌ మాఫియాను అంతమొందించటమే లక్ష్యమంటూ ముందుకెళ్తోంది భాజపా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని