నానాటికీ నగుబాటు

ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్‌ ప్రస్తుతం నాయకుల వలసలతో విలవిల్లాడుతోంది. వీర విధేయులుగా ముద్రపడ్డ నాయకులూ ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతుండటంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ

Updated : 28 Jan 2022 05:20 IST

యూపీలో నాయకుల వలసలతో కాంగ్రెస్‌ కుదేలు

ఈనాడు, దిల్లీ: ఒకప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్‌ ప్రస్తుతం నాయకుల వలసలతో విలవిల్లాడుతోంది. వీర విధేయులుగా ముద్రపడ్డ నాయకులూ ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతుండటంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. నిజానికి ప్రియాంకా గాంధీ వాద్రా యూపీ వ్యవహారాల బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిస్థిలు మెరుగుపడతాయని అధిష్ఠానం భావించింది. కానీ ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత- పశ్చిమ యూపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్‌), యూపీకే చెందిన కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద పార్టీని వీడారు. తాజాగా మరో కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ కూడా నిష్క్రమించడంతో.. రాష్ట్రంలో దాదాపుగా కాంగ్రెస్‌ ప్రముఖులంతా పార్టీని వీడినట్లయింది! గత అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్‌ ఏడు సీట్లు గెల్చుకోగా.. వారిలో నలుగురు ఇప్పటికే వేరే పార్టీల్లో చేరిపోవడం అక్కడ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.

యూపీలో కాంగ్రెస్‌ చివరిసారిగా 1985-89 మధ్య అధికారంలో కొనసాగింది. 1985 ఎన్నికల్లో 39.25% ఓట్లతో 269 సీట్లు గెల్చుకున్న ఆ పార్టీ.. 2017 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో కలసి పోటీచేసింది. అప్పుడు 6.25% ఓట్లతో కేవలం ఏడు సీట్లను దక్కించుకోగలిగింది. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన ఇంకా ఎలాంటి పేలవ స్థాయికి దిగజారుతుందోనన్న ఆందోళన హస్తం నేతల్లో ఉంది. మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే 10 మందికి పైగా ముఖ్య నేతలు కాంగ్రెస్‌ను వీడారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఇచ్చినా.. సుప్రియా అరోన్‌, హైదర్‌ అలీఖాన్‌ పార్టీని అట్టిపెట్టుకొని ఉండలేదు. రాయబరేలీ లోక్‌సభ స్థానం పరిధిలోని రాయ్‌బరేలీ ఎమ్మెల్యేగా 2017లో విజయం సాధించిన అదితి సింగ్‌, హర్‌చంద్‌పుర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితిని చూస్తున్న ప్రియాంక.. తానే సీఎం అభ్యర్థినని చెప్పుకోలేకపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని