Chandrababu: ఎన్టీఆర్‌ స్మృతివనం ప్రాజెక్టు ఎందుకు నిలిపేశారు?

రాష్ట్రంలో ఎన్టీఆర్‌ విగ్రహాలను ధ్వంసం చేస్తూ, అమరావతిలో ఎన్టీఆర్‌ స్మృతివనం ప్రాజెక్టును నిలిపివేసిన జగన్‌ ప్రభుత్వం... ఆయనపై ఎంతో ప్రేమ ఉందని ప్రజల్ని నమ్మించేందుకు విజయవాడ కేంద్రంగా ఏర్పాటుచేస్తున్న జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిందని తెదేపా నేతలు పేర్కొన్నారు.

Updated : 28 Jan 2022 05:23 IST

ఆయన విగ్రహాల్ని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు?
కొత్త జిల్లాకు ఆయన పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం
తెదేపా వ్యూహ కమిటీ సమావేశంలో నేతల వ్యాఖ్యలు
అశాస్త్రీయ విభజనతో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని మండిపాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ఎన్టీఆర్‌ విగ్రహాలను ధ్వంసం చేస్తూ, అమరావతిలో ఎన్టీఆర్‌ స్మృతివనం ప్రాజెక్టును నిలిపివేసిన జగన్‌ ప్రభుత్వం... ఆయనపై ఎంతో ప్రేమ ఉందని ప్రజల్ని నమ్మించేందుకు విజయవాడ కేంద్రంగా ఏర్పాటుచేస్తున్న జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టిందని తెదేపా నేతలు పేర్కొన్నారు. చివరకు ఎన్టీఆర్‌ పేరుమీద ఉన్న అన్న క్యాంటీన్లనూ జగన్‌ ప్రభుత్వం నిలిపివేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను ఎవరు గౌరవించినా తాము స్వాగతిస్తామని, కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టడాన్ని తామెందుకు వ్యతిరేకిస్తామని గురువారం తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ వ్యూహకమిటీ సమావేశంలో నాయకులు పేర్కొన్నారు.

ప్రజల సమస్యల్ని, ఉద్యోగుల ఆందోళనల్ని పక్కదారి పట్టించేందుకే:రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలతో పాటు, పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళనల్ని పక్కదారి పట్టించేందుకే జగన్‌ ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చిందని తెదేపా వ్యూహకమిటీ ధ్వజమెత్తింది. ‘జనగణన పూర్తయ్యేవరకూ జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి ఆదేశాలున్నా.. జగన్‌రెడ్డి ఏకపక్షంగా జిల్లాల విభజన చేపట్టారు. పైగా అది అస్తవ్యస్తంగా చేశారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిర్ణయాలు జరిగినందునే నిరసనలు మొదలయ్యాయి’ అని దుయ్యబట్టారు.‘అశాస్త్రీయంగా కొత్త జిల్లాల్ని ప్రకటించడంతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితులు వచ్చాయి. కనీసం మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించకుండా రాత్రికి రాత్రి నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సిన అవసరమేమొచ్చింది? 21న మంత్రివర్గంలో దీనిపై చర్చించలేదు. కానీ 25వ తేదీన రాత్రికి రాత్రి మంత్రులకు నోట్‌ పంపి ఆమోదం పొందాల్సినంత అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది?’ అని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. గుడివాడలో క్యాసినో నిర్వహించిన మంత్రిపై చర్యలు తీసుకునేదాకా పోరాడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని