AndhraPradesh News: రాజ్యసభకు వైకాపా నుంచి ఆ నలుగురు!

రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుల్లో వి.విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సురేష్‌ ప్రభుల పదవీకాలం జూన్‌ 21న ముగియనుంది. ఈ నాలుగు స్థానాలకు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి

Updated : 30 Jan 2022 07:02 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుల్లో వి.విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సురేష్‌ ప్రభుల పదవీకాలం జూన్‌ 21న ముగియనుంది. ఈ నాలుగు స్థానాలకు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశముంది. విజయసాయిరెడ్డి వైకాపా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన స్థానంతోపాటు మిగిలిన మూడు కూడా వైకాపాకే దక్కనున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. విజయసాయిని మళ్లీ కొనసాగించే అవకాశం ఉందన్న చర్చ వైకాపాలో ఉంది. మిగిలిన మూడు స్థానాల్లో రెండు తమ సొంత పార్టీ నేతలకు, ఒకటి ఉత్తర భారతదేశానికి చెందిన కార్పొరేట్‌ దిగ్గజానికి ఇచ్చే అవకాశం ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు పార్టీ నేతల్లో ఒకరు నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు, మరొకరు గుంటూరు జిల్లాలో మూడేళ్ల నుంచి ఏ అవకాశమూ దక్కని సీనియర్‌ నేత అని అంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడిని గత వారం ముఖ్యమంత్రి తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ఆ సందర్భంగా రాజ్యసభకు పంపే అవకాశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. బీద మస్తాన్‌రావుకు బీసీ కోటాలో అవకాశం ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నాలుగు స్థానాల్లో ఒకటి ఎస్సీ/మైనారిటీకి ఇవ్వవచ్చన్న వాదన కూడా వైకాపా వర్గాల్లో ఉంది. అయితే... నలుగురు అభ్యర్థుల తుది వివరాలు అధికారికంగా బయటకు రాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని