Congress: మేఘాలయలో కాంగ్రెస్‌ ఖాళీ.. మిగిలిన ఎమ్మెల్యేలంతా భాజపా కూటమిలోకి!

మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీ కుప్పకూలింది. ఆ పార్టీకి ఇప్పటివరకూ మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేలు... భాజపా మద్దతున్న అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి (ఎండీఏ)లో

Updated : 09 Feb 2022 08:42 IST

షిల్లాంగ్‌: మేఘాలయలో కాంగ్రెస్‌ పార్టీ కుప్పకూలింది. ఆ పార్టీకి ఇప్పటివరకూ మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేలు... భాజపా మద్దతున్న అధికార మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి (ఎండీఏ)లో మంగళవారం చేరిపోయారు. అంతకుముందు వారంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని... కూటమి నేత, ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మాకు లేఖ అందజేశారు. తాజా పరిణామంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా మారింది.

కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత అంపరీన్‌ లింగ్డోతో పాటు... మేరాల్‌బోర్న్‌ సియేం, మోహెన్డ్రోరాప్‌సాంగ్‌, కేఎస్‌ మార్బనియాంగ్‌, పీటీ సాక్మిలు ఎండీఏలో చేరుతున్నట్టు లేఖలో వెల్లడించారు. ‘‘మేఘాలయ ప్రజాస్వామ్య కూటమిలో చేరాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. మా మద్దతుతో ఎండీఏ మరింత బలపడి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తుందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతుందని ఆశిస్తున్నాం’’ అని వారు అందులో పేర్కొన్నారు. ఇదే లేఖను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కూడా పంపారు! కూటమిలో చేరినా, తాము మాత్రం కాంగ్రెస్‌ సభ్యులుగానే కొనసాగుతామని సీఎల్పీ నేత అంపరీన్‌ లింగ్డో చెప్పడం విశేషం. ముఖ్యమంత్రితో కలిసి అయిదుగురు ఎమ్మెల్యేలు దిగిన ఫొటోను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు.

వలసలతో దెబ్బ...

2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో ఇద్దరు మరణించగా, ఉప ఎన్నికల్లో ఆ రెండు స్థానాలనూ నేషనల్‌ పీపుల్స్‌ పార్టీయే కైవసం చేసుకొంది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా సహా మొత్తం 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గతేడాది తృణమూల్‌ గూటికి చేరారు. మిగిలిన అయిదుగురు ఇప్పుడు ఎండీఏకు మద్దతు ప్రకటించారు.

త్రిపురలో కాంగ్రెస్‌ గూటికి భాజపా ఎమ్మెల్యేలు

త్రిపురలో భాజపాను వీడి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు సుదీప్‌రాయ్‌ బర్మన్‌, ఆశిష్‌ సాహాలు కాంగ్రెస్‌ గూటికి చేరారు. అగ్రనేత రాహుల్‌గాంధీతో మంగళవారం ఆయన నివాసంలో భేటీ అయ్యారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సుదీప్‌రాయ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని