మద్య నిషేధమంటూ ప్రభుత్వం మోసం: యనమల

మద్య నిషేధం అమలు చేస్తామని వైకాపా ప్రభుత్వం మహిళలను మోసగించిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలకు నిరసనగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆదివారం

Published : 14 Feb 2022 05:38 IST

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం: మద్య నిషేధం అమలు చేస్తామని వైకాపా ప్రభుత్వం మహిళలను మోసగించిందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలకు నిరసనగా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆదివారం ఉభయ గోదావరి జిల్లాల నారీ సంకల్ప దీక్ష నిర్వహించారు. తెదేపా నేతలు పలువురు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యనమల ప్రసంగిస్తూ... వైకాపా మహిళలకు అన్యాయం చేసిందన్నారు. మద్యం ద్వారానే రూ.16 వేల కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతోందని.. ఇది మహిళలకు తీరని నష్టమని, డ్వాక్రా సంఘాలతోనూ ఓటీఎస్‌ను లంకె పెట్టి స్త్రీల పొదుపు సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. వంగలపూడి అనిత మాట్లాడుతూ వైకాపా అరాచక పాలనకు మొదట బలవుతోంది మహిళలేనన్నారు. నాసిరకం, కల్తీ మద్యం అమ్మి ఆడపడుచుల తాళిబొట్లు తెంచుతున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు 1,500 అత్యాచారం కేసులు నమోదు కావటం రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. అనంతరం యనమల రామకృష్ణుడు మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు, జవహర్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని