అప్పుల కోసమే విద్యుత్తు ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

వైకాపా ప్రభుత్వం అప్పుల కోసమే విద్యుత్తు ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని..విద్యుత్తు ఉత్పత్తి, వినియోగం సక్రమంగా జరపడానికి కాదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు.

Published : 19 Feb 2022 05:02 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకట్రావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ప్రభుత్వం అప్పుల కోసమే విద్యుత్తు ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని..విద్యుత్తు ఉత్పత్తి, వినియోగం సక్రమంగా జరపడానికి కాదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్తు కార్పొరేషన్‌ను చూపి జగన్‌రెడ్డి ప్రభుత్వం రూ.26,261 కోట్లు అప్పు తెచ్చిందని.. ఆ భారం ప్రజలపై పడుతోందని విమర్శించారు. ‘‘మూడేళ్లలో రూ.వేల కోట్ల భారాన్ని ప్రజలు, విద్యుత్తు సంస్థలపై మోపిన సీఎం. రోజుకి 6 నుంచి 8 గంటల పాటు విద్యుత్తు కోతలు పెడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితేంటని ప్రజలు వాపోతున్నారు. అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణకు రూపాయి నిధులు లేకుండా విద్యుత్తు బకాయిల పేరుతో జగన్‌ ప్రభుత్వం పంచాయతీల నిధుల్ని లాగేసుకుంది. విద్యుత్తు ఛార్జీలు, ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా తెచ్చిన అప్పులు, పంచాయతీల నుంచి లాక్కున్న విద్యుత్తు బకాయిలు మొత్తంగా రూ.60 వేల కోట్ల వరకు జగన్‌రెడ్డి ప్రభుత్వం దోచేసింది. జెన్‌కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, థర్మల్‌ పవర్‌ స్టేషన్లు, సౌర విద్యుత్తు కేంద్రాలు, జల విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా వచ్చే విద్యుత్తుపై ఈ ప్రభుత్వం సమీక్షించిందిలేదు. పైగా చౌకగా దొరికే విద్యుత్తును వదిలేసి అధిక ధరలకు  ఎందుకు కొనుగోలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని కళావెంకట్రావు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని