అయోధ్యలో కమలం హవా కొనసాగేనా!

ఎన్నికల ప్రచార సభలకు హాజరయ్యే ప్రజల సంఖ్యనే విజయానికి సంకేతంగా భావించేటట్లయితే అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ దఫా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకే అవుతుంది! శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో శుక్రవారం ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పాల్గొన్న రోడ్‌ షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు.

Updated : 27 Feb 2022 05:38 IST

భాజపా అభ్యర్థికి ఎస్పీ గట్టిపోటీ (లఖ్‌నవూ నుంచి అతుల్‌చంద్ర)

ఎన్నికల ప్రచార సభలకు హాజరయ్యే ప్రజల సంఖ్యనే విజయానికి సంకేతంగా భావించేటట్లయితే అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ దఫా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకే అవుతుంది! శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో శుక్రవారం ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పాల్గొన్న రోడ్‌ షోకు ప్రజలు భారీగా తరలివచ్చారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కార్యక్రమానికి హాజరైన వారికన్నా దాదాపు రెండింతలుగా ఉండడం విశేషం. అయితే, ఎన్నికల సభల్లో కనిపించే జన సందోహపు సందడి అన్ని వేళలా ఓట్ల రూపంలోకి మారుతుందన్న గ్యారంటీ ఏమీలేదు. అయోధ్య ప్రధాన అంశంగానే భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాలతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ ప్రధాన భూమిక వహించే స్థాయికి ఎదిగింది. అయితే, ఈ దఫా ఆ పార్టీకి స్థానికంగా సమాజ్‌వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అయిదో దశ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఇక్కడ పోలింగ్‌ జరగనుంది.  రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కనుక అయోధ్య ప్రజలు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి వేద్‌ ప్రకాశ్‌ గుప్త 50వేల ఓట్లకుపైగా ఆధిక్యంతో ఎస్పీ అభ్యర్థి తేజ్‌ నారాయణ్‌ అలియాస్‌ పవన్‌ పాండేపై గెలుపొందారు. మరోసారి ఈ విజయాన్ని పునరావృతం చేసేందుకు కమలదళం శ్రమిస్తోంది. పట్టణ ప్రాంత ఓటర్లు అధికంగా ఉన్న అయోధ్య నియోజకవర్గంలో భాజపా, ఎస్పీ తరఫున పాత అభ్యర్థులే బరిలోకి దిగారు. అధికార పార్టీపై ప్రజల్లో వ్యక్తమయ్యే వ్యతిరేకత వేద్‌ ప్రకాశ్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉండడంతో దానిని తొలగించేందుకు ఆరెస్సెస్‌, విశ్వహిందూ పరిషత్‌లు రంగంలోకి దిగాయి.  రామజన్మభూమి వివాదం సమసిపోయి ఆలయ నిర్మాణం కొనసాగుతున్నా ఈ అంశాన్ని భాజపా తనకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడంలేదు. ఆలయం కోసం సేకరించిన భూముల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఆ పార్టీకి ప్రతిబంధకంగా మారాయి. ఎకరాకు రూ.లక్షల్లో చెల్లించి సామాన్యుల నుంచి  కొనుగోలు చేసిన నాయకులు అదే భూమిని రూ.2 కోట్లకు పైగా బడా నేతలకు, అధికారులకు విక్రయించి సొమ్ము చేసుకున్న తీరు విమర్శలకు కారణమవుతోంది. సామాజిక వర్గాల ప్రభావం, శాంతి భద్రతల అంశాలూ ప్రస్తుత ఎన్నికల్లో కీలకపాత్ర వహిస్తున్నాయి. అయోధ్య..హిందువుల అస్తిత్వ చిహ్నమని, దానిని కోల్పోతే భారీగా నష్టపోతామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హెచ్చరించడం గమనార్హం. 3.79లక్షల మంది ఓటర్లున్న అయోధ్యలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో వేచిచూడాల్సిందే మరి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts