AP Budget 2022: బొత్స కుమారుడి వివాహ విందు కోసం సభకు విరామమా?

పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ రిసెప్షన్‌ కోసమే శాసనసభ సమావేశాలకు బుధవారం సెలవు ప్రకటించారని తెదేపా శాసనసభాపక్షం విమర్శించింది. నేతల ఇళ్లలో పెళ్లిళ్లు, పేరంటాలకు సభకు సెలవులు ఇవ్వడమేంటని ప్రశ్నించింది. తెదేపా శాసనసభాపక్ష సమావేశం సోమవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు

Updated : 08 Mar 2022 07:34 IST

తప్పుబట్టిన తెదేపా శాసనసభాపక్షం

ఈనాడు, అమరావతి: పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ రిసెప్షన్‌ కోసమే శాసనసభ సమావేశాలకు బుధవారం సెలవు ప్రకటించారని తెదేపా శాసనసభాపక్షం విమర్శించింది. నేతల ఇళ్లలో పెళ్లిళ్లు, పేరంటాలకు సభకు సెలవులు ఇవ్వడమేంటని ప్రశ్నించింది. తెదేపా శాసనసభాపక్ష సమావేశం సోమవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఉదయం శాసనసభ సలహా కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యల గురించి చంద్రబాబు, ఇతర నాయకులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు. నేతల ఇళ్లలో వేడుకలకు సెలవులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని శాసనసభాపక్షం పేర్కొంది. వైకాపా ప్రభుత్వం వింత పోకడలతో సభా గౌరవం తగ్గేలా వ్యవహరిస్తోందని నాయకులు అభిప్రాయపడ్డారు.

గవర్నర్‌ను ఎలా గౌరవించాలో మీరా మాకు నేర్పేది: అయ్యన్న పాత్రుడు

గవర్నర్‌ను ఎలా గౌరవించాలో సీఎం జగన్‌ తెదేపాకు చెప్పక్కర్లేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘వయసులో పెద్దవారైన గవర్నర్‌ను తెలుగుదేశం గౌరవించాలని సీఎం జగన్‌రెడ్డి అంటున్నారు. వయసులో పెద్దవారు, తండ్రి తర్వాత తండ్రి లాంటి బాబాయికి ఆయనిచ్చిన గౌరవమేంటో అందరికీ తెలుసు’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని