Congress: ఎందుకు ఓడుతున్నాం!

అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆదివారం సాయంత్రం 4 గంటలకు సమావేశం కాబోతోంది. ప్రస్తుత ఓటమిపై చర్చించడానికి తక్షణం

Updated : 13 Mar 2022 06:42 IST

వరుస ఎన్నికల వైఫల్యాలపై కాంగ్రెస్‌ సంఘర్షణ

నేడు వాడీ…వేడిగా జరగనున్న సీడబ్ల్యూసీ భేటీ

నాయకత్వ, సంస్థాగత మార్పుపైనా చర్చ

సోనియా, రాహుల్‌, ప్రియాంక రాజీనామా చేయనున్నారంటూ ఊహాగానాలు

ఖండించిన కాంగ్రెస్‌

ఈనాడు, దిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) ఆదివారం సాయంత్రం 4 గంటలకు సమావేశం కాబోతోంది. ప్రస్తుత ఓటమిపై చర్చించడానికి తక్షణం వర్కింగ్‌ కమిటీని సమావేశపరచాలని గులాంనబీ ఆజాద్‌ లాంటి సీనియర్‌ నాయకులు కోరిన నేపథ్యంలో పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అందుకు ముహూర్తాన్ని ఖరారుచేశారు. అయితే ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తమ పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉందన్న కథనాలు శనివారం హల్‌చల్‌ చేశాయి.

వీటిని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. భాజపా చేస్తున్న దుష్ప్రచారంగా కొట్టిపారేసింది. అయితే తాజా ఎన్నికల్లో వైఫల్యం గాంధీ కుటుంబాన్ని వెన్నాడే అవకాశం ఉంది. పంజాబ్‌లో రాహుల్‌గాంధీ విస్తృతంగా పర్యటించినా కాంగ్రెస్‌ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. కేవలం 18 స్థానాలకు పరిమితమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి. అన్నీ తానై ప్రియాంకగాంధీ ప్రచారం చేసినా 403 స్థానాల్లో కాంగ్రెస్‌కు యూపీలో రెండే లభించాయి. ఇదివరకు అధికారం చెలాయించిన మణిపుర్‌, గోవా, ఉత్తరాఖండ్‌లను కూడా గెలుచుకోలేకపోయింది. వరుసగా పరాజయాలతో.. పార్టీ ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైన నేపథ్యంలో ఈ సీడబ్యూసీ భేటీ వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. తప్పులను సరిదిద్దుకోకపోతే ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో కూడా కాంగ్రెస్‌ ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. మరోవైపు సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు పార్లమెంటరీ వ్యూహ బృందంతో సోనియా సమావేశం కానున్నారు. రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

పొంచి ఉన్న ఆప్‌ ప్రమాదం!

కాంగ్రెస్‌ డీలాపడితే ఆ స్థానాన్ని ఆక్రమించడానికి ఆప్‌ సిద్ధంగా ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన హిమాచల్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేజ్రీవాల్‌ పార్టీ గణనీయమైన ఓట్లను దక్కించుకొని కాంగ్రెస్‌కు హెచ్చరిక సంకేతాన్ని ఇచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌లో దివంగత నేత వీరభద్రసింగ్‌ లేని లోటును భర్తీచేసుకోవడానికి అక్కడ బలమైన నేతను హస్తం పార్టీ తయారుచేసుకోవాలి. లేదంటే అక్కడ ఆప్‌ విస్తరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పంజాబ్‌లో పాగా వేసిన ఆప్‌.. హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణాల్లో విస్తరించడానికి పావులు కదపడం ఖాయం. ఇలాంటి ముందస్తు ప్రమాదాలపై సీడబ్ల్యూసీ చర్చించి భవిష్యత్తు కార్యాచరణను తయారుచేసే అవకాశం ఉంటుందన్న చర్చ వినిపిస్తోంది.

అధిష్ఠానంపై జీ-23 గరంగరం!

గత కొన్నాళ్లుగా అధిష్ఠానం అనుసరిస్తున్న వ్యూహాలు, విధానాలను తప్పుపడుతున్న జీ-23 నేతలు ఆదివారం భేటీలో దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం ఈ కూటమిలోని కొందరు నేతలు గులాంనబీ ఆజాద్‌ నివాసంలో సమావేశమయ్యారు. వరుస ఓటములతో బలహీనమవుతున్న పార్టీని ఎలా పునరుద్ధరించాలన్న అంశంపై చర్చించారు. సంస్థాగతంగా పార్టీలో మార్పులు జరగాలని, అంతర్గత ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని ఈ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో పార్టీ అనుసరించిన వ్యూహంపై వీరు అసంతృప్తిగా ఉన్నారు. ఆఖరి క్షణంలో సీఎం మార్పు, చన్నీ, సిద్ధూల మధ్య విభేదాలు.. తదితర అంశాలపై సీడబ్ల్యూసీ సమావేశంలో జీ-23 నేతలు ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్‌, కేరళ, పుదుచ్చేరి, అస్సాం శాసనసభ ఓటములపై ఆయా కమిటీలు సమర్పించిన నివేదికలపై ఇప్పటివరకు చర్చ జరగని అంశాన్ని ప్రస్తావించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని