ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తాం

సీఎం జగన్‌ అహంకారానికి, సామాన్యుల ఆత్మ గౌరవానికి మధ్య పోరాటమే జనసేన ఆవిర్భావ సభ అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఇప్పటంవద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో సినీనటుడు నాగబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 14 Mar 2022 05:27 IST

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ మనోహర్‌

తాడేపల్లి, కృష్ణలంక - న్యూస్‌టుడే, ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ అహంకారానికి, సామాన్యుల ఆత్మ గౌరవానికి మధ్య పోరాటమే జనసేన ఆవిర్భావ సభ అని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఇప్పటంవద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో సినీనటుడు నాగబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార అహంకారంతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రానికి మేలు చేయాలనే మంచి ఆలోచన కలిగిన వ్యక్తి పవన్‌ అని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సభలో పవన్‌ ప్రసంగిస్తారని మనోహర్‌ తెలిపారు.

అట్టహాసంగా ఏర్పాట్లు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ఇప్పటం ముస్తాబైంది. సోమవారం జరగనున్న సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా భారీ సభ నిర్వహించింది. తర్వాత జరగనున్న అతి పెద్ద సభ ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ తరఫున ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, పీఏసీ సభ్యులు, ఇప్పటం గ్రామస్థులకు ప్రత్యేక గ్యాలరీలు నిర్మించారు. కనకదుర్గ వారధి నుంచి సభాస్థలి వరకూ ప్రధాన రహదారికి ఇరువైపులా, సర్వీసు రహదారుల్లో షామియానాలు ఏర్పాటుచేసి సభకు వచ్చేవారికి ఆహారం, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయటానికి చర్యలు చేపట్టారు. రెండు తెలుగురాష్ట్రాల సంస్కృతి ఉట్టిపడేలా సభ ప్రారంభానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదికలు సిద్ధం చేశారు. రెండు రాష్ట్రాల నుంచి కవులు, గాయకులు, జానపద నృత్య కళాకారులను ఆహ్వానించారు.

మనోహర్‌ను కలిసిన అఖిలభారత చిరంజీవి యువత

అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, సభ్యులు ఆదివారం పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. సభను విజయవంతం చేయాలని మనోహర్‌ వారికి సూచించారు.

వారధిపై జనసేన ఫ్లెక్సీల తొలగింపు

సభ సందర్భంగా కనకదుర్గమ్మ వారధిపై ఏర్పాటు చేసిన జనసేన ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంపై వివాదం చెలరేగింది. సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు నాదెండ్ల మనోహర్‌, నాయకులు ఆదివారం ఉదయం వారధి పై నుంచి వెళుతూ పార్టీ ఫ్లెక్సీలను తొలగిస్తుండటాన్ని చూశారు. కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌, ఇద్దరు నగర పాలక సంస్థ సిబ్బంది కలిసి బ్యానర్లను తీసేస్తున్నారు. దీంతో వాహనాలను ఆపి ఎందుకు తొలగిస్తున్నారంటూ కానిస్టేబుల్‌ను మనోహర్‌ ప్రశ్నించారు. అప్పుడే వచ్చిన ఎస్సై కృష్ణసాయిని నిలదీశారు. వారధిపై బ్యానర్ల ఏర్పాటును నిషేధిస్తూ నగరపాలక సంస్థ కమిషనర్‌ గతంలోనే ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్సై తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తే అవకాశం ఉండటంతో తీసేస్తున్నామని చెప్పారు. దీనిపై మనోహర్‌, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాంటి దౌర్జన్యాలు చేయడం ఏంటంటూ మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పి.. సభ ప్రాంగణానికి వెళ్లిపోయారు. ఫ్లెక్సీల తొలగింపు విషయం తెలిసి జనసేన నాయకులు పెద్ద ఎత్తున వారధి వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకటమహేశ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దీంతో విజయవాడ-గుంటూరు మార్గంలో కొంతసేపు ట్రాఫిక్‌ ఆగిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని