Andhra News: అక్కడ ‘మోదీ అన్న ఇళ్లు’ అని ఫ్లెక్సీలు పెడతాం: సోము వీర్రాజు

‘‘త్వరలో పూర్తయ్యే జగనన్న ఇళ్ల వద్దకు వెళ్లి ‘మోదీ అన్న ఇళ్లు’ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం. పథకాల మీదున్న పేర్లను సరిచేస్తాం’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

Updated : 05 Apr 2022 08:36 IST

ఈనాడు, విశాఖపట్నం: ‘‘త్వరలో పూర్తయ్యే జగనన్న ఇళ్ల వద్దకు వెళ్లి ‘మోదీ అన్న ఇళ్లు’ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం. పథకాల మీదున్న పేర్లను సరిచేస్తాం’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు మించి కేంద్రం అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు కేంద్రం నిధులిస్తోందన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని విమర్శించారు. స్థానిక సంస్థలకు చెల్లించిన పన్నులను సైతం లాగేసుకుంటుందన్నారు. సోమవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆరోపించారు. ఇక్కడున్న ప్రాజెక్టులను విస్మరించి ఒక్క పోలవరం గురించే మాట్లాడుతున్నారన్నారు. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా మార్చేందుకు భాజపా కంకణం కట్టుకుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కార్యాచరణ రూపొందించామని వివరించారు. ‘జలం కోసం ఉత్తరాంధ్ర జనపోరు’ పేరుతో ఈ నెల 7, 8, 9 తేదీల్లో సాగు నీటి ప్రాజెక్టులను పార్టీ నాయకులు సందర్శిస్తారన్నారు. అక్కడి సమస్యలను తెలుసుకొని, పరిష్కరించడానికి ఎంత ఖర్చు అవుతుందో నివేదిక తయారు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడుతూ 7న హిరమండలంలోని వంశధార బ్యారేజీ వద్ద, 8న మడ్డువలస వద్ద, 9న ముగింపు సభ చోడవరంలో ఉంటుందన్నారు. పార్టీ నాయకులు గద్దె బాబూరావు, విష్ణుకుమార్‌రాజు, పైడి వేణుగోపాలం, నిమ్మక జయరాజు, సుహాసినీ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని