2020 లోనే డయాఫ్రం వాల్‌ దెబ్బతింటే ఎందుకు దాచారు?

ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినట్టుగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ 2020లోనే దెబ్బతింటే ఇప్పటివరకూ ఎందుకు దాచిపెట్టారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న సంస్థల్ని జగన్‌ ...

Published : 23 Apr 2022 05:18 IST

తెదేపా నేతలు దేవినేని, నిమ్మల ధ్వజం

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినట్టుగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ 2020లోనే దెబ్బతింటే ఇప్పటివరకూ ఎందుకు దాచిపెట్టారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న సంస్థల్ని జగన్‌ తన రాజకీయ ప్రయోజనాలు, ధనదాహం కోసం మార్చేసి, గోదావరికి వరదలు వచ్చేనాటికి అక్కడ అర్హతలేని సంస్థలు, అనుభవం లేని అధికారుల్ని పెట్టడంతో వరద నీటి తరలింపు సక్రమంగా చేయలేకపోయారని, దానివల్లే పోలవరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని మండిపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు శుక్రవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో వేర్వేరుగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పదో సమావేశం మినిట్స్‌ని, పదకొండో పీపీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందనే వివరాల్ని ముఖ్యమంత్రి వెంటనే బహిర్గతం చేయాలని ఉమా డిమాండు చేశారు. రివర్స్‌ టెండరింగ్‌లో రూ.800 కోట్లు ఆదా అయిందన్న ముఖ్యమంత్రి... 11వ పీపీఏ సమావేశంలో మాత్రం రూ.263 కోట్లే ఆదా అయిందని చెప్పారని ధ్వజమెత్తారు.

నిర్మాణం సక్రమంగానే జరిగిందని మీరే చెప్పారు కదా?

‘పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణం పీపీఏ చెప్పినట్టే జరిగింది తప్ప, ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా, లోపభూయిష్టంగా జరగలేదని కేంద్రానికి జగన్‌ ప్రభుత్వమే చెప్పింది’ అని ఉమా పేర్కొన్నారు.  ‘నిర్వాసితులకు రూ.10 లక్షలిస్తాను, రూ.20 లక్షలిస్తానని బీరాలు పలికిన జగన్‌... చివరకు గిరిజనుల్ని గాలికొదిలేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన ప్రాజెక్టు పనులకు కేంద్రం రూ.4,500 కోట్లు విడుదల చేస్తే, జగన్‌ ప్రభుత్వం నిర్వాసితులకు చెల్లించకుండా ఇతర అవసరాలకు వాడుకుంది. పోలవరం ఎప్పటికి పూర్తిచేస్తారో చెప్పగలరా? అని జగన్‌కు ఛాలెంజ్‌ చేస్తున్నాను. అక్కడ రాజశేఖరరెడ్డి విగ్రహం ఎందుకు పెడుతున్నారు? పోలవరం పనుల్ని నాలుగేళ్లు ఆపినందుకా?’ అని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణంలో జగన్‌ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపుతూ కేంద్రానికి లేఖ రాస్తామన్నారు.

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలెందుకు చెప్పారు?

రాష్ట్రంలో ఎన్ని సాగునీటి ప్రాజెక్టులున్నాయో, వాటిద్వారా ఎన్ని వేల ఎకరాలకు నీరివ్వవచ్చో తెలియని జగన్‌రెడ్డి, డయాఫ్రం వాల్‌ గురించి తెలియని అంబటి రాంబాబు ప్రజల్ని పాలించే స్థితిలో ఉండటం మన దురదృష్టమని నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ‘తెదేపా ప్రభుత్వం 2022 జూన్‌కి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుని, ఏకకాలంలో కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రం వాల్‌, స్పిల్‌వే, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌లు నిర్మించింది. కాబట్టే 71% పనులు పూర్తయ్యాయి. గోదావరి నదిపై కాకుండా, నదీ ప్రవాహాన్ని మళ్లించేలా పోలవరం ప్రాజెక్టు రూపొందింది. అనుకోకుండా వరదలు వచ్చినప్పుడు... 50 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్‌వే మీదుగా తరలించే అవకాశం ఉంది. గతంలో వరదలు వచ్చినప్పుడు అధికార యంత్రాంగం ఆ పని సమర్థంగా నిర్వహించింది. కానీ జగన్‌రెడ్డి నిబంధనలన్నీ మార్చేశారు. కాంట్రాక్టు సంస్థలను మారిస్తే ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకమవుతుందని పీపీఏ అధికారులు చెప్పినా వినలేదు. 2021 జూన్‌లో పూర్తిచేస్తానని ఒకసారి, 2021 డిసెంబర్లో అని ఒకసారి, 2022 జూన్‌లో అని మరోసారి తేదీలు ఎందుకు మార్చారు? డయాఫ్రం వాల్‌ దెబ్బతిని, దానిపై ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణానికి వీల్లేదని తెలిసి... అసెంబ్లీ సాక్షిగా ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్పారు? రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించి, ప్రాజెక్టు నిర్మాణాన్ని అపహాస్యంగా మార్చినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని