న్యాయం కోరితే నోటీసులా?

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన యువతిని, ఆమె కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు వెళ్లిన తనకు, తెదేపా అధినేత చంద్రబాబుకు మహిళా

Published : 24 Apr 2022 05:17 IST

మహిళా కమిషన్‌ అధికారాల్ని వాసిరెడ్డి పద్మ దుర్వినియోగం చేస్తున్నారు

ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తాం

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజం

విజయవాడ (చుట్టుగుంట) న్యూస్‌టుడే: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన యువతిని, ఆమె కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు వెళ్లిన తనకు, తెదేపా అధినేత చంద్రబాబుకు మహిళా కమిషన్‌ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళల హక్కులను కాపాడాల్సిన మహిళా కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తోందని ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడుతూ మండిపడ్డారు. పరామర్శించేందుకు చంద్రబాబు వస్తున్నారని తెలిసి, కావాలనే మహిళాకమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మను ప్రభుత్వం పంపిందని ఆయన ధ్వజమెత్తారు. అక్కడికి వచ్చిన పద్మ.. ఆమెను ప్రశ్నించిన మహిళల్ని చెయ్యెత్తి కొట్టబోయారన్నారు. ‘బాధితురాల్ని పరామర్శిస్తే మాకు నోటీసులిస్తారా? కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ కుర్చీకున్న విలువేంటో ఆమెకు తెలుసా? కమిషన్‌ అధికారాల్ని దుర్వినియోగం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు’ అని ఆయన ధ్వజమెత్తారు. వాసిరెడ్డి పద్మ అధికార దుర్వినియోగంపై హైకోర్టును ఆశ్రయిస్తామని, జాతీయ మహిళా కమిషన్‌తో పాటు, అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లోనూ ఫిర్యాదుచేస్తామని తెలిపారు. ‘మాకిచ్చిన నోటీసులో 27న హాజరవ్వాలని ఒకచోట రాశారు. మరో చోట నవంబరులో రావాలని ఉంది. అసలు చదివే సంతకం పెట్టారా?’ అని మండిపడ్డారు.

మూడు రోజుల వరకూ తీరిక లేదా?
సామూహిక అత్యాచారం ఘటనపై పట్టించుకునే నాథుడే లేడని బొండా ఉమా ధ్వజమెత్తారు. ఘటన జరిగిన మూడురోజుల వరకూ స్పందించే తీరిక ప్రభుత్వానికి లేదా? అని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ తరహా ఘటనలు చాలా జరిగాయి. వాటిపై ఎందుకు స్పందించలేదు? బాధితురాలిని పరామర్శిస్తే మాపై కేసులు పెట్టి నోటీసులు ఇస్తారా? చట్టం మీకు చుట్టమా.. మాకు హక్కులు ఉండవా? అన్యాయంగా ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్నేమీ చేయలేరు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా హోంమంత్రి మీడియా ముందుకు ఎలా వచ్చారు? ఇంత ఘోరం జరిగినా ప్రభుత్వంలో చలనం లేదేం? పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నామంటే సరిపోతుందా? ఆస్పత్రి సిబ్బందికి బాధ్యత లేదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి చంద్రబాబు తెదేపా తరఫున రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రకటించాకే ప్రభుత్వం హడావుడిగా రూ.10 లక్షలు ప్రకటించిందని బొండా ఉమా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని