Chandrababu: మీరు పొత్తులు అక్కర్లేదని ఎగిరిపడుతున్నారు

‘రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటాయి. వైకాపావాళ్లు ఇప్పుడు తమకు పొత్తులు అక్కర్లేదని ఎగిరిపడుతున్నారు. మీ నాన్న కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తెరాస, సీపీఐ, సీపీఎంతో కలిసి మహాకూటమి

Updated : 09 May 2022 09:02 IST

మీ నాన్న మహా కూటమి పెట్టలేదా?
సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు ఎద్దేవా

ఈనాడుడిజిటల్‌, న్యూస్‌టుడే- చిత్తూరు: ‘రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటాయి. వైకాపావాళ్లు ఇప్పుడు తమకు పొత్తులు అక్కర్లేదని ఎగిరిపడుతున్నారు. మీ నాన్న కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తెరాస, సీపీఐ, సీపీఎంతో కలిసి మహాకూటమి కట్టారు. మీ నాన్న కంటే గొప్పోడివా?’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌ను ఎద్దేవా చేశారు. పులినని చెప్పుకొనే జగన్‌మోహన్‌రెడ్డికి ఇప్పుడు పోలీసుల భద్రత లేనిదే ప్రజల్లో తిరిగే ధైర్యం లేదన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి సందీప్‌ తల్లి శ్రీదేవి ఇటీవల మరణించడంతో, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు చంద్రబాబు ఆదివారం చిత్తూరు వచ్చారు. పుంగనూరు నియోజకవర్గంలో వైకాపా నాయకుల దాడిలో గాయపడి, చిత్తూరులో చికిత్స పొందుతున్న రాజారెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మంత్రి అనుచరులు బరితెగించి, దాడులు చేస్తున్నారు.. దాడులకు తెగబడుతున్న వారి అంతు చూస్తామని హెచ్చరించారు. మంత్రి అండ ఉందని కొందరు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారి లెక్క సరి చేస్తామని స్పష్టం చేశారు. ‘వైకాపా గూండాలు రాజారెడ్డిపై దాడి చేస్తే దాడికి పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని తెదేపా శ్రేణులు కల్లూరులో ధర్నాకు పిలుపునిచ్చాయి. 144 సెక్షన్‌ విధించి తెదేపా నాయకులపై కేసులు పెట్టి అరెస్టులు చేయడం దారుణం. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను ప్రశ్నించిన సందీప్‌ కోళ్ల ఫారాలపై దాడి చేయించారు. దమ్ముంటే రాజకీయంగా పోరాడాలే తప్ప ఇలా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులపై దాడులు చేయిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. వైకాపా పాలనలో ఇప్పటికే రాష్ట్రం సర్వనాశనమైపోయింది. వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సామాన్యులెవరూ ఉండరు. దీనిపై ప్రజలూ ఆలోచించాలి. గ్రామాల్లో ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు డిపాజిట్లు రావు. ఈసారి తెదేపా విజయం ఖాయం. వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో చల్లా బాబు గెలుస్తారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ మంత్రి అమరనాథరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బి.ఎన్‌.రాజసింహులు ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని