Updated : 09 May 2022 09:01 IST

వైకాపా వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రంలో అంధకారమే

ప్రజా సంక్షేమం కోసమే పొత్తులుంటాయి
అవకాశమివ్వండి.. కోట్ల మంది కన్నీరు తుడుస్తా
నంద్యాల జిల్లా కౌలు రైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, కర్నూలు: వైకాపా వ్యతిరేక ఓటు చీలిపోయి... ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ అంధకారంలోకి వెళ్లిపోతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 132 మంది రైతుల కుటుంబాలకు కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా రూ.లక్ష చొప్పున సాయాన్ని ఆదివారం ఆయన అందించారు. ఈ సందర్భంగా శిరివెళ్లలో ఏర్పాటు చేసిన రచ్చబండలో మాట్లాడారు. వైకాపా తన ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టినా, రోజుకు ఒకరితో బూతులు తిట్టించినా తన పోరాట పంథాలో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. వైకాపా మాట తప్పుతున్న హామీలు, తీసుకుంటున్న నిర్ణయాలు, పాలనపైనే ప్రశ్నిస్తానని, ఇదే పంథా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 15 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. మద్యం ద్వారా వస్తున్న డబ్బును వచ్చే ఎన్నికల్లో పంచేందుకు వైకాపా నేతలు దాచుకుంటున్నారని విమర్శించారు.

మైనారిటీలకు సముచిత స్థానం ఇస్తాం

‘రంజాన్‌ కోసం ఇఫ్తార్‌ విందులిచ్చి, టోపీలు పెట్టుకుని ఫొటోలకు పోజులిచ్చి రాజకీయం చేయడం నాకు చేతకాదు. కచ్చితంగా జనసేన ప్రభుత్వంలో మైనారిటీలకు సముచిత స్థానం కల్పిస్తాం. వైకాపాకు గత ఎన్నికల్లో పని చేసిన మైనారిటీలు ఇప్పుడు విసుగు చెందారు. ప్రతి పనికీ ప్రజాప్రతినిధులకు లంచాలు ఇచ్చుకోలేక బాధపడుతున్నారు. కచ్చితంగా మైనారిటీల సంక్షేమానికి, ఉద్యోగాలకు, భవిష్యత్‌కు జనసేన అండదండలుంటాయి’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కర్నూలు జిల్లాలోని కొణిదెల (జిల్లాలో గ్రామం పేరు) తన ఇంటి పేరని పేర్కొన్నారు.

ముందు మీ అతి తగ్గించుకోండి

‘రాజకీయాల్లో పౌరుషాలుండవు. వ్యూహాలే ఉంటాయి. వైకాపా నాయకులు ఏమైనా అంటే సింహం సింగిల్‌గా వస్తుందని సెటైర్లు వేస్తున్నారు. మేము ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో.. ఎలా రాజకీయాలు చేయాలో మీరు నేర్పుతారా? ముందు మీ అతి తగ్గించుకోండి’ అంటూ వైకాపా నేతలకు పవన్‌ కల్యాణ్‌ హితవు పలికారు.


అద్భుతం జరుగుతుందని భావిస్తున్నా..

‘రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసం, అభివృద్ధి కోసం కచ్చితంగా బలమైన ఆలోచనా విధానంతో ముందుకెళ్తాం. భవిష్యత్తులో రాష్ట్రంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నా’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. తెదేపా ఆహ్వానిస్తే పొత్తు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లివద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైకాపా పాలనలో ఎవరినీ బతకనీయడం లేదు. కౌలు రైతులకు అండగా ఉండట్లేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించట్లేదు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకుండా నిరుద్యోగాన్ని పెంచుతున్నారు. పరిశ్రమలు రావడం లేదు.. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది.. కరెంటు కోతలు... ఇలా సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవన్నీ చూశాక రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన ప్రత్యామ్నాయం కావాలని.. అందుకు చాలామంది కలసి రావాలని భావించాను. బిడ్డలు చేసిన తప్పులకు తల్లే బాధ్యత వహించాలని మాట్లాడే విపరీత ధోరణులు బాధ కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా ఏపీ భవిష్యత్తుకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. దీన్ని జనసేన బలంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇందులో ఎవరెవరు కలుస్తారో.. ఈ రోజుకు నాకూ తెలియదు. అంతా కలిసి వచ్చి రాష్ట్ర సమస్యను విశాల దృష్టితో అర్థం చేసుకుని ప్రజలకు ఎంత భరోసా కల్పిస్తారన్నది భవిష్యత్తులో తేలుతుంది’ అని పేర్కొన్నారు. తెదేపాతో పొత్తుకు వ్యతిరేకమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెబుతున్న నేపథ్యంలో తెదేపాతో మీరు పొత్తుకు సిద్ధమా.. కాదా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం 100 శాతం భాజపాతోనే పొత్తు ఉందని చెప్పారు. పొత్తులకు కలిసొస్తే.. అవసరమైతే త్యాగం చేస్తామని చంద్రబాబు చెప్పారు కదా.. దీనిపై మీ స్టాండ్‌ ఏమిటన్న ప్రశ్నకు... 2014లో భాజపా, జనసేన, తెదేపా కలిసి పోటీ చేశాయని పవన్‌ కల్యాణ్‌ గుర్తు చేశారు. సమస్యలను పరిష్కరించలేనప్పుడు పొత్తులో నుంచి బయటకు వచ్చి ప్రజల పక్షాన నిలుస్తామని సమాధానమిచ్చారు. భాజపాతో కలిసి పని చేస్తున్నారు కానీ.. పోరాటం ఒంటరిగా చేస్తున్నారు కదా.. అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ త్వరలో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం

ప్రజల అండతో జనసేన పార్టీ వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడేందుకు నాయకులకు భయమని, ఎలాంటి భయం లేకుండా తాను మాట్లాడుతున్నానని చెప్పారు. అందుకే ఈ విషయాలను భాజపా జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళుతున్నానని తెలిపారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని