Andhra News : ఫోన్లను ట్యాప్‌ చేసి అరెస్టు చేశాం: మంత్రి పెద్దిరెడ్డి

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటివరకూ 60 మందిని అరెస్టు చేసిందని, దీనిపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసి వారి ఫోన్లను ట్యాపింగ్‌ చేసి.. నిజమైన బాధ్యులను అరెస్టు చేశారని విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి

Updated : 11 May 2022 08:45 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటివరకూ 60 మందిని అరెస్టు చేసిందని, దీనిపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసి వారి ఫోన్లను ట్యాపింగ్‌ చేసి.. నిజమైన బాధ్యులను అరెస్టు చేశారని విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఎక్కువగా లీకేజీ వ్యవహారమంతా నారాయణ విద్యా సంస్థల్లోనే జరిగినట్లు తేలిందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసి ఉండొచ్చని వెల్లడించారు. మరి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడా ప్రశ్నపత్రాలు లీకవ్వలేదని ప్రకటించారు కదా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అదే మంత్రి 60 మందిని అరెస్టు చేయించారుగా.. అయినా విచారణ పూర్తయ్యేదాకా ఎవరైనా విలేకరుల ముందుకొచ్చి పేపర్‌ లీకైందని.. ఇంత మందిని అరెస్టు చేశామని చెబుతారా?’ అని బదులిచ్చారు. మీ విద్యాశాఖ మంత్రే చెప్పారు కదా? అని విలేకరులు మళ్లీ ప్రశ్నించగా.. ‘నేను విద్యాశాఖ మంత్రిని కాదు. సీఎంవోకు వెళ్లి అడిగితే అరెస్టు విషయం చెప్పారు’ మంత్రి సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని