Andhra News: ముందస్తు ఎన్నికలనడానికి చంద్రబాబుకేం హక్కుంది: మంత్రి బొత్స

‘ఎంతసేపూ మతాలు, వర్గాలు అనడం తప్ప.. పేదలు, ఎస్సీ, ఎస్టీల కోసం కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఏం చేసింది? పరిస్థితి చల్లగా ఉందంటే వెంటనే మందిరమో.. మరోటో తీసుకొస్తారు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ...

Updated : 18 May 2022 07:25 IST

ఈనాడు, అమరావతి: ‘ఎంతసేపూ మతాలు, వర్గాలు అనడం తప్ప.. పేదలు, ఎస్సీ, ఎస్టీల కోసం కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఏం చేసింది? పరిస్థితి చల్లగా ఉందంటే వెంటనే మందిరమో.. మరోటో తీసుకొస్తారు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వంలో కలిసి ఉన్నప్పుడు ఆయనపై ఒత్తిడి తెచ్చి ఎస్సీల కోసం ఏమైనా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయించి.. ఇప్పుడు ఎస్సీల గురించి మాట్లాడితే ఫర్వాలేదు. అప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు మాట్లాడటం ఏంటి¨’ అని విమర్శించారు. మంగళవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఎస్సీల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ తీరుతో వారు మరింత పేదలవుతున్నారని భాజపా ఆందోళన చేపట్టిందని విలేకరులు అడగ్గా మంత్రి పై విధంగా స్పందించారు. ‘రాష్ట్రంలో భాజపాకు ఏం స్థాయి ఉంది? దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చింది? రాష్ట్రంలో వైకాపా ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? మా వల్ల పేదలయ్యారా? భాజపా వాళ్లు ఏం మాట్లాడతారు?’ అని ప్రశ్నించారు. అప్పులపై బొత్స స్పందిస్తూ.. ‘కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయట్లేదా? చంద్రబాబు అప్పులు చేయకుండా ఆయన ఆస్తులను అమ్మి ప్రజలకు తెచ్చిపెట్టారా?’ అని ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ.. ‘ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారు? అవినీతికి తావులేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్నాం. ఏవైనా ఒకటి రెండు కష్టాలుంటే అవి కేంద్ర విధానాలు, పెట్రోలు, డీజిల్‌ ధరలతోనే.. వాటితో దేశంలోని అందరూ ఇబ్బంది పడుతున్నారు’ అని పేర్కొన్నారు. ‘ముందస్తు ఎన్నికలు ఎందుకు వస్తాయి? ప్రజలు ఓటేసింది ప్రభుత్వం ఐదేళ్లు ఉండేందుకు కదా? ముందస్తు ఎన్నికలు చంద్రబాబుకు కావాలి. అయినా ఆ విషయంలో మా పార్టీ, మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయించడానికి చంద్రబాబు ఎవరు’ అని వ్యాఖ్యానించారు. శ్రీలంక పరిస్థితికి కూతవేటు దూరంలో ఏపీ ఉందన్న పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యల గురించి విలేకరులు అడగ్గా.. ‘ప్రతి ఒక్కరికీ శ్రీలంకతో పోల్చడం అలవాటైపోయింది. శ్రీలంకలో పటిష్ఠమైన నాయకత్వం లేదు. ఒక విధానం లేదు కాబట్టే అలా అయింది. ఇక్కడ పటిష్ఠ నాయకత్వం ఉంది. ప్రభుత్వానికి, పార్టీకి ఒక విధానం ఉంది. ఇక్కడ శ్రీలంక పరిస్థితి ఎలా వస్తుంది’ అని ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని