యుద్ధానికి పునాది వేశాం

రాష్ట్రంలో యుద్ధానికి పునాది వేశాం. ఇది ట్రైలర్‌ మాత్రమే. సినిమా ముందుంది. నారా చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిగా చేసే వరకూ పిడికిలి బిగించి పోరాటం చేద్దాం. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు చేస్తున్న పోరాటం..

Published : 21 May 2022 05:54 IST

రాజాంలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌  

ఈనాడు, విజయనగరం, న్యూస్‌టుడే- రాజాం: ‘రాష్ట్రంలో యుద్ధానికి పునాది వేశాం. ఇది ట్రైలర్‌ మాత్రమే. సినిమా ముందుంది. నారా చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిగా చేసే వరకూ పిడికిలి బిగించి పోరాటం చేద్దాం. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు చేస్తున్న పోరాటం...’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో శుక్రవారం ఆయన పర్యటించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు నివాసంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు. అనంతరం రోడ్‌షో నిర్వహించారు. దారి పొడవునా కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొండ్రు మురళీమోహన్‌ ఆధ్వర్యంలో ఐదు పంచాయతీలకు చెందిన వైకాపా గ్రామస్థాయి నాయకులు తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడారు. ‘మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 55 మంది తెదేపా నాయకులపై, నాలుగు వేల మంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. నాపైనా 14 కేసులు ఉన్నాయి. హత్యానేరం కూడా మోపారు. ఎవరైనా పారిపోయారా.. భయపడ్డారా..? రేపు గెలిచిన తర్వాత మన కార్యకర్తల మీద ఎన్ని కేసులు ఉన్నాయని నేను అడుగుతాను. కేసులు లేకపోతే వారు పోరాటం చేయనట్లే...’ అని పేర్కొన్నారు. ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, కూన రవికుమార్‌, వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని