ఎస్సీ ఎస్టీలపై దాడులు ఎన్నాళ్లు?

బడుగు, బలహీనవర్గాల మీద జరుగుతున్న దారుణాలపై ముందుగా సమాధానం చెప్పాలని.. లేదంటే మంత్రుల బస్సు యాత్రను అడ్డుకుంటామని జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌ కుమార్‌ ప్రకటించారు.

Published : 21 May 2022 05:54 IST

మంత్రుల బస్సు యాత్రను అడ్డుకుంటాం
‘జై భీమ్‌ భారత్‌’ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: బడుగు, బలహీనవర్గాల మీద జరుగుతున్న దారుణాలపై ముందుగా సమాధానం చెప్పాలని.. లేదంటే మంత్రుల బస్సు యాత్రను అడ్డుకుంటామని జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌ కుమార్‌ ప్రకటించారు. విజయవాడలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘వైకాపా నేతలు తమ అనుచరులను సైతం చంపేస్తున్నారు. కాకినాడలో ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ను చంపించి, ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి విషయంలో కుటుంబసభ్యులు ఎమ్మెల్సీపై అనుమానం వ్యక్తం చేసినా ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?’ అని ప్రశ్నించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు తరిమి కొడుతున్నారు. హోంమంత్రి ప్రజల భద్రతపై దృష్టిపెట్టడం లేదు. వరస దాడులపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..’ అని విమర్శించారు. ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే ‘విద్యా కానుక’లో దోపిడీ జరుగుతోంది. పుస్తకాలు, బ్యాగుల కొనుగోళ్లల్లో గుజరాతీ కంపెనీలకు దోచి పెడుతున్నారు. ఎస్సీ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కోసం గుజరాత్‌, పుణే కంపెనీలకు కాంట్రాక్టు ఇచ్చి కమిషన్లు నొక్కుతున్నారు’ అని ఆయన ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని