ఓట్లేసిన బడుగులపైనే దాడులు

దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ.. ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను బర్తరఫ్‌ చేయాలనే డిమాండ్‌తో జూన్‌ 2న చలో రాజ్‌భవన్‌ నిర్వహించాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం

Published : 24 May 2022 03:58 IST

ఎమ్మెల్సీ అనంత బాబును బర్తరఫ్‌  చేయాలంటూ 2న చలో రాజ్‌భవన్‌

రాజకీయ పార్టీలు, దళిత, ప్రజా సంఘాల పిలుపు

ఈనాడు, అమరావతి: దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ.. ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను బర్తరఫ్‌ చేయాలనే డిమాండ్‌తో జూన్‌ 2న చలో రాజ్‌భవన్‌ నిర్వహించాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపునిచ్చింది. గవర్నర్‌, శాసన మండలి ఛైర్మన్‌లకు వినతి పత్రాలను సమర్పించాలని నిర్ణయించింది. విజయవాడ దాసరి భవన్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు, దళిత, మహిళా, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ‘అధికార అహంకారంతో వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ తన డ్రైవర్‌ను హతమార్చి కారులో మృతదేహాన్ని తీసుకొచ్చి కుటుంబీకులకు అప్పగించారు. ఇప్పటివరకు నేను ఇలాంటి ఘటన చూడలేదు. దీనిలో పోలీసుల వ్యవహారశైలి అనుమానాలకు తావిస్తోంది. హత్యకు పాల్పడిన ఎమ్మెల్సీపై వైకాపా అధిష్ఠానం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?’ అని ప్రశ్నించారు. ఏజెన్సీలో అత్యంత దుర్మార్గమైన వ్యక్తి అనంతబాబు అని, అతడి అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు డిమాండ్‌ చేశారు. ‘బడుగు, బలహీనవర్గాలను నెత్తిన పెట్టుకొని చూసుకుంటామని నమ్మించి.. అధికారంలోకి వచ్చిన వైకాపా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారిపై దాడులు చేస్తోంది. తన దగ్గర పని మానేశాడనే అహంకారంతో ఇంటి నుంచి తీసుకెళ్లి చంపి, శవాన్ని తీసుకోవాలని తల్లిదండ్రులను బెదిరించడం చూస్తే ఎంత బరి తెగించారో అర్థమవుతోంది’ అని జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ విజయవాడ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు, మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకుడు హరినాథ్‌, ఎంసీపీఐ(యు) నాయకుడు ఖాదర్‌బాషా, మాల మహానాడు జాతీయ కార్యదర్శి లాజర్‌బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌పై చర్యలు తీసుకునే వరకు పోరాడతామని, అతడికి మద్దతిచ్చేలా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని