కొందరు వెనుక ఉండి నడిపిస్తున్నారు

కోనసీమలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు... కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ‘20 మంది పోలీసులను దారుణంగా రాళ్లతో కొట్టి గాయపరిచారు. ప్రైవేటు స్కూల్‌ బస్సును తగలబెట్టారు. పోలీసులపై దాడిని ఖండిస్తున్నాం.

Published : 25 May 2022 05:16 IST

అమలాపురం ఘటనపై హోంమంత్రి తానేటి వనిత

ఈనాడు, అమరావతి: కోనసీమలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు... కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ‘20 మంది పోలీసులను దారుణంగా రాళ్లతో కొట్టి గాయపరిచారు. ప్రైవేటు స్కూల్‌ బస్సును తగలబెట్టారు. పోలీసులపై దాడిని ఖండిస్తున్నాం. వెనుక కొంత మంది ఉండి ఇదంతా నడిపిస్తున్నట్లు అక్కడి చర్యలు కనిపిస్తున్నాయి. వారు పార్టీల మనుషులైనా, సంఘ విద్రోహశక్తులైనా చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. ‘కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని అక్కడి ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలూ చేసిన డిమాండు మేరకే పేరు మార్చాం. దీన్ని వ్యతిరేకించడం, అల్లర్లు చేయడం బాధాకరం’ అని వ్యాఖ్యానించారు.


దుష్టశక్తులు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయి
మంత్రి ఆదిమూలపు సురేష్‌

కొన్ని దుష్టశక్తులు ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంబేడ్కర్‌ లాంటి మహానుభావుడి పేరు ఒక జిల్లాకు పెడితే వ్యతిరేకించడం బాధాకరమని తెలిపారు. మంత్రి విశ్వరూప్‌, ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్లపై అల్లరిమూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై మంగళగిరిలో మంత్రి సురేష్‌ సమీక్ష నిర్వహించారు. నిజాయతీగా పని చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన సూచించారు.


మంత్రి ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం: సీపీఐ కె.రామకృష్ణ

అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడిని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆందోళనకారులు తమ అభ్యర్థనను శాంతియుతంగా తెలపాలే కానీ.. ఇలా దాడులకు పాల్పడటం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని