ముమ్మాటికీ పోలీసు, ప్రభుత్వ వైఫల్యమే

కోనసీమలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు.. ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సున్నితమైన ఈ అంశంలో హోంమంత్రి తెదేపాపై నిరాధార ఆరోపణలు

Published : 25 May 2022 05:19 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: కోనసీమలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు.. ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సున్నితమైన ఈ అంశంలో హోంమంత్రి తెదేపాపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని, ప్రజలు సంయమనం పాటించాలని, ప్రశాంతత నెలకొల్పేందుకు సహకరించాలని ఒక ప్రకటనలో కోరారు.


జగన్‌రెడ్డి రాజకీయ కుట్రలో భాగమే గొడవలు: శైలజానాథ్‌

కొత్తగా జిల్లా ఏర్పాటు చేసినప్పుడు వెలువడిన గెజిట్‌లో పేరు పెట్టకుండా ఇప్పుడు హడావుడిగా కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరు పెట్టడం చూస్తుంటే.. జగన్‌రెడ్డి రాజకీయ కుట్రలో భాగమేనన్న అనుమానం వ్యక్తమవుతోందని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు. ప్రజలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా జగన్‌రెడ్డి ప్రభుత్వ ధోరణి ఉందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కోనసీమకు చాలా ఏళ్లుగా అంబేడ్కర్‌, కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని ప్రతిపాదించినా...కొత్త జిల్లాల ఏర్పాటులో ఆ పేర్లు పెట్టకుండా చేయడం జగన్‌రెడ్డి అహంకారానికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ అంబేడ్కర్‌ పట్ల గౌరవ భావం ఉంటుందని, ఆయన పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమని శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు. జేఏసీల ముసుగులో దాడులకు పాల్పడ్డ వారిపై తక్షణం అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


ప్రభుత్వమే బాధ్యత వహించాలి: సోము వీర్రాజు

అమలాపురం ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. గుంటూరులో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం జరిగిన శోభాయాత్ర నిర్వహిస్తే నేతలను పోలీసులు అరెస్టు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. దేశ విభజనకు కారకుడైన జిన్నా పేరును తొలగించి మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం పేరును టవర్‌కు పెట్టాలని డిమాండ్‌చేశారు. అంబేడ్కర్‌ పేరును వైకాపా ప్రభుత్వం అనవసరంగా వివాదంలోకి లాగిందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా అణగారిన వర్గాల వారికి దిక్సూచిగా ఉన్న అంబేడ్కర్‌ పేరును ఒక జిల్లాకు పెట్టడం ద్వారా వచ్చే లాభమేమిటో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని పేర్కొన్నారు.  


కోనసీమ పేరును వివాదాస్పదం చేయొద్దు: సీపీఎం

విజయవాడ, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోససీమ జిల్లా పేరును వివాదాస్పదం చేస్తూ హింసాత్మక ఘటనలు జరగడం విచారకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాల పునర్విభజన సందర్భంగా అనేక జిల్లాలకు స్వాతంత్య్ర సమరయోధులు లేదా ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టారని పేర్కొన్నారు. ఆ తర్వాత కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ నామకరణం చేశారని, సకాలంలో అన్ని జిల్లాలతో పాటు ఈ పేరు ప్రకటించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై కొన్ని స్వార్థపు శక్తులు ప్రజల్లో విద్వేషాలు రగిల్చి, వివాదం చేయడాన్ని సీపీఎం ఖండిస్తోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని