సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలి

దళిత యువకుడిని హత్యచేసిన అనంతబాబుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు. పెదపూడి మండలం జి.మామిడాడలో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను అఖిలపక్ష నాయకులతో కలిసి ఆయన మంగళవారం పరామర్శించారు.

Published : 25 May 2022 05:26 IST

అఖిలపక్ష నాయకుల డిమాండు

పెదపూడి (జి.మామిడాడ), న్యూస్‌టుడే: దళిత యువకుడిని హత్యచేసిన అనంతబాబుపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు. పెదపూడి మండలం జి.మామిడాడలో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను అఖిలపక్ష నాయకులతో కలిసి ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. కుటుంబాన్ని పోషించే యువకుడిని కిరాతకంగా చంపడం దారుణమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో జూన్‌ 2న సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో గవర్నర్‌ను కలుస్తామన్నారు. తెదేపా నాయకుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ.. వైకాపా పాలనలో దళితులపట్ల అరాచకాలు మితిమీరుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ, పోలీసులపై తమకు నమ్మకం లేదని.. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండు చేశారు. న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, కాంగ్రెస్‌ నాయకుడు కె.వినయ్‌ కుమార్‌, రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, దళిత హక్కుల పోరాట సమితి సభ్యుడు కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

మా కుటుంబానికి రక్షణ కావాలి: సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ: ‘ఎమ్మెల్సీ అనంతబాబువల్ల మా కుటుంబానికి హాని ఉంది. ఆయనను బర్తరఫ్‌ చేసి కఠినంగా శిక్షించాలి. పోస్టుమార్టం సమయంలో పోలీసులు నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. నా చేతులపై కొట్టారు. అనంతబాబు బెయిలుపై బయటకు వచ్చి మా కుటుంబాన్ని చంపేస్తారనే భయం ఉంది. పోలీసులు మాకు న్యాయం చేస్తారనే నమ్మకం లేదు. మాకు రక్షణ కల్పించి కేసును సీబీఐకి అప్పగించి, అనంతబాబుకు ఉరిశిక్ష వేసేలా చర్యలు తీసుకోవాలి.’

భయపెడుతున్నారు: సుబ్రహ్మణ్యం తండ్రి సత్తిబాబు: ‘ఎమ్మెల్సీ అనంతబాబు 19వ తేదీ అర్ధరాత్రి మా కుటుంబాన్ని తీవ్రంగా భయపెట్టారు. మా అబ్బాయి మృతి విషయంలో ఆయన చెప్పేదంతా కట్టుకథ. అనంతబాబు ఉండే అపార్టుమెంటులో నేను పదేళ్లు పని చేశాను. అపార్టుమెంటు గేటుకు, రోడ్డుకు చాలా దూరం ఉంటుంది. కారు నుంచి గేటువద్ద పడిపోయాడన్నది అబద్ధం.’
మా అమ్మను బెదిరించారు: సుబ్రహ్మణ్యం తమ్ముడు నవీన్‌: ‘ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూస్తే అక్కడ ప్రమాదం జరిగిన ఆనవాళ్లేవీ లేవు. ప్రమాదానికి గురైన మోటారుబైకు ఏదని ఆయనను అడిగితే.. బండిని ఆటోలో పంపేశానన్నారు. తమ తల్లిని పక్కకు తీసుకెళ్లి ఖర్చులకు రూ.2లక్షలు ఇస్తానని చెబుతూ.. ‘చిన్నబ్బాయి కూడా ఉన్నాడు, ఆలోచించుకోండి’ అని బెదిరించారు.’

సీబీఐకి అప్పగించాలి: ముప్పాళ్ల
రాజమహేంద్రవరం నేరవార్తలు: ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ నిజాయతీగా జరగాలంటే సీబీఐకి అప్పగించాలని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. కాకినాడ ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు నిందితుడిని కాపాడేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. దళిత, ప్రజాసంఘాల ఉద్యమాల తర్వాతే పోలీసుల్లో కదలిక వచ్చిందనే విషయం అందరికీ తెలుసన్నారు. ఈ కేసులో స్థానిక పోలీసులు విచారణ జరిపితే నిందితులు తప్పించుకోవడం ఖాయమని, వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని