హత్యచేసిన వ్యక్తికి గౌరవ మర్యాదలా?

‘ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యంను హత్యచేశానని స్వయంగా అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబుపట్ల పోలీసులు అత్యంత గౌరవ మర్యాదలు కనబరిచిన తీరు చూస్తే విస్మయం కలుగుతోంది. సామాన్యులపట్ల కూడా ఇంతే సహృదయత కనబరుస్తారా?

Published : 25 May 2022 05:42 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యంను హత్యచేశానని స్వయంగా అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబుపట్ల పోలీసులు అత్యంత గౌరవ మర్యాదలు కనబరిచిన తీరు చూస్తే విస్మయం కలుగుతోంది. సామాన్యులపట్ల కూడా ఇంతే సహృదయత కనబరుస్తారా? నేరాలకు పాల్పడే వారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకుంటే.. శాంతి భద్రతల గురించి ఆలోచన చేయలేం. ఈ విధమైన తీరుకు పోలీసుల కంటే వారిపై ఆధిపత్యం చలాయిస్తున్న రాజకీయ బాసులే కారణం’ అని పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘ఈ రాష్ట్రంలో దాడులు, హత్యలు, అత్యాచారాలు చేసినా ఏం జరగదు అనే ధైర్యం నేరస్తులకు కలగడానికి పాలకుల వైఖరే కారణం. కోడి కత్తి కేసు, వివేకానందరెడ్డి హత్య కేసుల్లో అసలు నేరస్థులను పట్టుకుని చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించి ఉంటే... నేరం చేసిన వాళ్లకు పోలీసులపై చులకన భావన, ఏమీ కాదులే అనే ధైర్యం వచ్చి ఉండేవా? రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను వైకాపా పాలకుల నుంచి ఏమీ ఆశించలేం. వారికి చిత్తశుద్ధి ఉంటే.. హత్య చేశాను అని అంగీకరించిన ఎమ్మెల్సీపై ఈ పాటికే పార్టీ పరంగా, పెద్దల సభ నుంచి పంపేలా చర్యలు తీసుకునేవారు. అందువల్ల పోలీసు అధికారులే బాధ్యత తీసుకొని రాజకీయ బాసుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా శాంతిభద్రతల పరిరక్షణలో స్వతంత్రంగా వ్యవహరించాలి’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని