ఇదేనా వైకాపా సామాజిక న్యాయం?

వైకాపా తలపెట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర నాటకమని తెదేపా పొలిట్‌బ్యూరో ధ్వజమెత్తింది. ‘మూడేళ్ల పాలనలో ఏ వర్గానికీ న్యాయం చేయకుండా సామాజిక న్యాయ యాత్రేంటి?’ అని మండిపడింది. తెదేపా పొలిట్‌బ్యూరో

Published : 27 May 2022 05:25 IST

నిలదీసిన తెదేపా పొలిట్‌ బ్యూరో

ఈనాడు, అమరావతి: వైకాపా తలపెట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర నాటకమని తెదేపా పొలిట్‌బ్యూరో ధ్వజమెత్తింది. ‘మూడేళ్ల పాలనలో ఏ వర్గానికీ న్యాయం చేయకుండా సామాజిక న్యాయ యాత్రేంటి?’ అని మండిపడింది. తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాత్రి ఒంగోలులో జరిగింది. ‘తాజాగా ఎంపికైనవారితో కలిపి 9మంది వైకాపా రాజ్యసభ సభ్యుల్లో నలుగురు ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందినవారే. 9 మందిలో ముగ్గురు బయటి రాష్ట్రాలవారు. ముగ్గురు సీఎం జగన్‌తో పాటు కేసుల్లో ఉన్నవారు. లాబీయింగ్‌ చేసేవారికి, కేసుల్లో సహ ముద్దాయిలకు రాజ్యసభ పదవులిచ్చారు’ అని పొలిట్‌బ్యూరో విమర్శించింది. తెలంగాణలో 12 వెనుకబడిన కులాల్ని బీసీల జాబితా నుంచి తొలగిస్తే నోరెత్తని ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ఎలా సమంజసమని సభ్యులు ధ్వజమెత్తారు. ‘మైనారిటీలకు రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లి అడ్డుపడిన కృష్ణయ్య తప్ప రాష్ట్రంలో రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి బీసీ నేతలే లేరా? రాజ్యసభ సభ్యుల్లో ఒక ఎస్సీగానీ, ఒక ఎస్టీగానీ, ఒక మైనారిటీ గానీ లేరు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి వైకాపా తరఫున రాజ్యసభలో ఒక్కరికీ ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు? ఏ వర్గానికీ న్యాయం చేయని వైకాపాకి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత, యాత్ర చేసే హక్కు ఎక్కడుంది?’ అని మండిపడ్డారు.


మహానాడులో 17 తీర్మానాలు

మహానాడులో ప్రవేశపెట్టే 17 తీర్మానాలకు పొలిట్‌బ్యూరో ఆమోదం తెలిపింది. మహానాడులో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి 12, తెలంగాణ తీర్మానాలు 3, అండమాన్‌కు సంబంధించి ఒక తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. వాటితోపాటు రాజకీయ తీర్మానం ఉంటుంది. తీర్మానాలపై 50 మంది మాట్లాడే అవకాశం ఉంది. సమావేశంలో పార్టీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బక్కని నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని