మౌలిక వసతుల కల్పనతోనే దేశ ప్రగతి

మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చిన దేశాలే ప్రగతి సాధిస్తున్నాయని చరిత్ర చెబుతోందని, దేశంలో అత్యున్నత నాణ్యతతో వసతులను ప్రజలకు అందిస్తున్నామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం నుంచి గురువారం సాయంత్రం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకకు సంబంధించిన ప్రాజెక్టులతోపాటు రూ.31,530 కోట్ల విలువైన 11 అభివృద్ధి పనులకు ఆయన వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. మూడు రాష్ట్రాల్ని కలిపే బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే...

Published : 27 May 2022 05:25 IST

తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ
రూ.31,530 కోట్ల అభివృద్ధి  పనులకు శ్రీకారం

ఈనాడు, చెన్నై: మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చిన దేశాలే ప్రగతి సాధిస్తున్నాయని చరిత్ర చెబుతోందని, దేశంలో అత్యున్నత నాణ్యతతో వసతులను ప్రజలకు అందిస్తున్నామని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం నుంచి గురువారం సాయంత్రం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకకు సంబంధించిన ప్రాజెక్టులతోపాటు రూ.31,530 కోట్ల విలువైన 11 అభివృద్ధి పనులకు ఆయన వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. మూడు రాష్ట్రాల్ని కలిపే బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే, చెన్నై పోర్టు-మదురవోయల్‌ డబుల్‌డెక్కర్‌ పైవంతెన, చెన్నైలో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు (ఎంఎంఎల్‌పీ)తోపాటు చెన్నై ఎగ్మూరు, రామేశ్వరం, మదురై, కాట్పాడి, కన్యాకుమారి రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేశంలో తొలిసారిగా అధునాతన సాంకేతికతతో నిర్మించిన లైట్‌హౌస్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎన్నూరు-చెంగల్పట్టు, తిరువళ్లూరు-బెంగళూరు మధ్య నేచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టుల్ని మోదీ ఆరంభించారు. మౌలిక సదుపాయాలంటే గతంలో రోడ్లు, విద్యుత్తు, తాగునీరు గురించి ఆలోచించేవారని.. ఇవాళ గ్యాస్‌ పైప్‌లైన్‌, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌, హైవేల గురించి ఆలోచనలు చేస్తున్నామని గుర్తుచేశారు. శ్రీలంక కష్టాల్లో ఉందని, దానికి అన్నివిధాలుగా సాయమందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.

జీఎస్టీ పరిహారాన్ని మరో రెండేళ్లు ఇవ్వాలి.. స్టాలిన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టే ప్రాజెక్టులను ప్రకటించిన తర్వాత కేంద్ర భాగస్వామ్య నిధుల్ని ఇవ్వకపోతే రాష్ట్రాలపై తీవ్రభారం పడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రధానికి వివరించారు.  కచ్ఛదీవిని స్వాధీనం చేసుకుని తమిళనాడు కోస్తా ప్రాంత మత్స్యకారుల హక్కుల సాధనకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది మే 15 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ పరిహారం కింద ఇవ్వాల్సిన రూ.14,006 కోట్లను త్వరగా చెల్లించాలని కోరారు. పలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కాకుండా జీఎస్టీ పరిహారాన్ని జూన్‌ తర్వాత మరో రెండేళ్లు పొడిగించాలని కోరారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి, కేంద్ర సహాయమంత్రి ఎల్‌.మురుగన్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


తెలంగాణలో మార్పు తథ్యం: మోదీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం యువత బలిదానాలు చేశారని.. ఒక కుటుంబ పాలన కారణంగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని, పాలన అవినీతిమయంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి అవి అతిపెద్ద శత్రువులని, వాటిని పారదోలితేనే అభివృద్ధి ద్వారాలు తెరుచుకుంటాయని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇక్కడ భాజపా అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయ ఆవరణలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్వాగత సభలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘తెలంగాణ ఉద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ఇక్కడ భాజపా కార్యకర్తలు ఎన్నో సవాళ్లు, వేధింపులు, దాడుల్ని ఎదుర్కొంటూ పోరాడుతున్నారు. [ పోరాటం అధికారం కోసం కాదు. యువతను భాగస్వామ్యం చేస్తూ రాష్ట్రాభివృద్ధిని సాధించడం లక్ష్యం’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని