సామాజిక న్యాయాన్ని ప్రారంభించింది తెదేపానే

సామాజిక న్యాయాన్ని తొలుత మొదలు పెట్టింది ఎన్టీఆర్‌ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీయే, ఆయన హయాంలో ప్రవేశ పెట్టిన తిండి, బట్ట, గూడు విధానాన్ని ఇప్పటికీ దేశంలోని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని

Published : 28 May 2022 04:53 IST

రాజకీయ తీర్మానం సందర్భంగా యనమల రామకృష్ణుడు

ఈనాడు, ఒంగోలు: సామాజిక న్యాయాన్ని తొలుత మొదలు పెట్టింది ఎన్టీఆర్‌ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీయే, ఆయన హయాంలో ప్రవేశ పెట్టిన తిండి, బట్ట, గూడు విధానాన్ని ఇప్పటికీ దేశంలోని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని శాసనమండలిలో తెదేపా పక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో 1982 కంటే ముందు నాటి దారుణమైన పరిస్థితులు మూడేళ్ల పాలనలో జగన్‌ చేశారు. ఆయనకు గుణపాఠం చెప్పాలి. వైకాపా ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు’ అని ధ్వజమెత్తారు. ‘వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే రాజకీయ లక్ష్యం’ అని పేర్కొన్నారు. మహానాడులో రాజకీయ తీర్మానాన్ని ఆయన ప్రవేశ పెట్టారు. 

దోచుకోవడమే లక్ష్యంగా బాదుడే బాదుడు: ఎమ్మెల్యే డోలా

దోచుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్‌ ప్రజల్ని ఎడాపెడా బాదేస్తున్నారని ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు. ‘బాదుడే-బాదుడు’పై మహానాడులో తీర్మానం ప్రవేశ పెడుతూ ఆయన మాట్లాడారు. ‘ఆర్టీసీ ఛార్జీలు రెట్టింపు చేశారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే ఉన్నాయి. వాటిపై రోడ్‌ ట్యాక్స్‌ వేయడం ద్వారా వచ్చే సొమ్ముతో రహదారులూ బాగు చేయడం లేదు’ అని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చి.. దానిపై వచ్చే ఆదాయాన్ని 15 ఏళ్లకు తాకట్టు పెట్టడం ద్వారా జగన్‌ మొదటి బాదుడు అక్కచెల్లెమ్మల పైనే పడిందని గౌతు శిరీష ధ్వజమెత్తారు. మూడేళ్ల పాలనలో జగన్‌ ప్రతి కుటుంబంపై బాదుడే బాదుడు పేరుతో రూ.1.08 లక్షల భారం మోపారని బీద రవిచంద్ర యాదవ్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని