Published : 28 May 2022 04:53 IST

మూడుసార్లు ఓడితే టికెట్‌ లేనట్లే!

పార్టీలో దీర్ఘకాల పదవుల విధానం రద్దు: లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: పార్టీలో సంస్థాగతంగా సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఓటమి పాలైన నాయకులకు ఈసారి టికెట్‌ ఇవ్వకూడదని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం మహానాడు సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పార్టీలో దీర్ఘకాల పదవుల విధానాన్ని రద్దుచేయాలనే ప్రతిపాదనను పెట్టినట్టు చెప్పారు. దీనిని తన నుంచే అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నానన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశానని, ఈసారి తప్పుకొని వేరొకరికి అవకాశం కల్పించాలని చూస్తున్నానని, అప్పుడే కొత్తవారికి అవకాశం లభిస్తుందని చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు రెండు పర్యాయాలు వరుసగా ఒకే పదవిలో ఉన్నవారికి బ్రేక్‌ ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఉన్న పదవిలోంచి పైస్థాయికైనా వెళ్లాలి.. లేకుంటే కింది స్థాయికి దిగాలి. ఈ రెండూ కాదంటే బ్రేక్‌ అయినా తీసుకోవాలన్నారు. 30 నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెద్దగా ఉండదని భావిస్తున్నానన్నారు. మహానాడు తర్వాత రెండు పెద్ద కుంభకోణాలు బయటపెట్టనున్నట్లు లోకేశ్‌ వెల్లడించారు. పార్టీ అధికారంలోకి రాగానే గత సంస్కృతికి భిన్నంగా కీలక మార్పులు తెస్తామని చెప్పారు. మంత్రులు పార్టీకి రిపోర్ట్‌ చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు.

పార్టీ ఆదేశిస్తే పాదయాత్ర

పొత్తులనేవి ఎన్నికలప్పుడు మాత్రమే జరిగే చర్చ అని లోకేశ్‌ అన్నారు. అంతా కలిసికట్టుగా పోరాడి ప్రజా కంటక ప్రభుత్వాన్ని దింపాలనే భావనతోనే పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారని స్పష్టంచేశారు. మహానాడుకు పోటీగా బస్సు యాత్ర పెట్టగా.. అది కూడా తుస్సుమందని ఎద్దేవా చేశారు. అమలాపురం ఘటనలో అడ్డంగా దొరికారని ఆరోపించారు. యువత అంటే వారసులేనా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. 40 శాతం సీట్ల కేటాయింపుల్లో వారసులతోపాటు పార్టీ కోసం శ్రమిస్తున్న యువత కూడా ఉంటారని వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే పాదయాత్రకు సిద్ధమని లోకేశ్‌ స్పష్టం చేశారు. ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్‌, పార్టీ కార్యకర్తనే చంపేస్తే, మరో ఎమ్మెల్యే తమ పార్టీ గ్రామ స్థాయి నేతను హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని