ప్రభుత్వ వైఫల్యాలకు పోలవరం బలి

రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలతో పోలవరం ప్రాజెక్టును బలి చేసిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి ప్రభుత్వమే నూరు శాతం బాధ్యత వహించాలన్నారు. పోలవరం పనులు చేస్తున్న సంస్థను మార్చొద్దని కేంద్రం చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే అనర్థం జరిగిందన్నారు.

Updated : 03 Jun 2022 08:19 IST

డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి బాధ్యత వహించాలి

ఆత్మకూరు ఉప ఎన్నికపై సంస్కారహీనంగా వైకాపా సవాళ్లు

తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, మండలాధ్యక్షులతో సమీక్ష

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలతో పోలవరం ప్రాజెక్టును బలి చేసిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి ప్రభుత్వమే నూరు శాతం బాధ్యత వహించాలన్నారు. పోలవరం పనులు చేస్తున్న సంస్థను మార్చొద్దని కేంద్రం చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే అనర్థం జరిగిందన్నారు. జగన్‌ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ అంటూ తెగ గొప్పలు చెప్పిందని, చివరకు ప్రాజెక్టే రివర్సైందని మండిపడ్డారు. తెదేపా మండలాధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో గురువారం చంద్రబాబు జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై తెదేపా చేపట్టిన బాదుడే బాదుడు, పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించారు. 2020లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం.. 2022 వచ్చినా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటూ ఇప్పుడు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న సాకుతో ప్రభుత్వం మళ్లీ వేధింపులు మొదలుపెట్టింది. మహానాడు విజయవంతం కావడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుండటంతో కుట్రపూరితంగా కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తోంది’ అని మండిపడ్డారు.

పోటీ చేయొద్దన్నది పార్టీ విధానం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేయరాదని తెదేపా తీసుకున్న నిర్ణయంపై వైకాపా నాయకులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, రాజకీయ విమర్శలు, సవాళ్లు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ‘చట్టసభ సభ్యుడు చనిపోయినప్పుడు, వారి కుటుంబసభ్యులకే ఉప ఎన్నికలో టిక్కెట్‌ ఇస్తే పోటీ పెట్టకూడదన్న విధానాన్ని తెదేపా పాటిస్తోంది. అందులో భాగంగానే గౌతమ్‌రెడ్డి చనిపోవడంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలోనూ పోటీ పెట్టడం లేదు. తెదేపా మొదటి నుంచీ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. మేం బద్వేల్‌లో ఎందుకు పోటీ చేయలేదో, ఆత్మకూరులోనూ అందుకే పోటీ చేయడం లేదు. రాజకీయాల్లో కొన్ని సంప్రదాయాలు పాటించాలి’ అని పేర్కొన్నారు. జగన్‌ పాలన చేయలేకపోతున్నారని, గడువుకు ముందే ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చన్న ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు. ఒక్క నెలలోనే రూ.9,500 కోట్ల అప్పులు తెచ్చారంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. ఏఈ సూర్యకిరణ్‌పై వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అధికార పార్టీ నేతల అకృత్యాలకు అంతం లేకుండా పోతోందని, స్వయంగా ప్రజాప్రతినిధులు, పార్టీ మూకలు అధికారులు, జనంపై దాడులు చేస్తుంటే సీఎం మౌనంగా ఉండటం దేనికి సంకేతమని మండిపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని