మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం.. విద్యార్థులకు ఉపయుక్తం

మైక్రోసాఫ్ట్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) చేసుకున్న ఒప్పందం వల్ల విద్యార్థులు ఉచితంగా పలు కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకునే వీలు కలుగుతుందని....

Published : 05 Dec 2021 05:23 IST

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ఈనాడు, విశాఖపట్నం: మైక్రోసాఫ్ట్‌ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ) చేసుకున్న ఒప్పందం వల్ల విద్యార్థులు ఉచితంగా పలు కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకునే వీలు కలుగుతుందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం విశాఖలోని ఏయూ కన్వెన్షన్‌ కేంద్రంలో జరిగిన దక్షిణ భారత నైపుణ్యాభివృద్ధి పోటీల ముగింపు వేడుకలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విజ్ఞానం, నైపుణ్యాలే ఎవరినైనా అత్యున్నతస్థాయికి తీసుకెళతాయన్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలకు సీఈవోలుగా ఎదిగిన భారతీయులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. చదువుకు తగ్గ నైపుణ్యాలు కూడా ఉండాలన్న ఉద్దేశంతో నైపుణ్యాభివృద్ధి సంస్థ పలు శిక్షణ కార్యక్రమాలు, కోర్సులు అందిస్తోందన్నారు. విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి, ఛైర్మన్‌ అజయ్‌రెడ్డి, ఎండీ బంగార్రాజు, వరల్డ్‌ స్కిల్స్‌ ఇండియా సీనియర్‌ హెడ్‌ అరుణ్‌ చందేల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 1న ప్రారంభమైన నైపుణ్యాభివృద్ధి పోటీలు శనివారంతో ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, తదితర రాష్ట్రాల నుంచి 500 మంది పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 125 మందిని విజేతలుగా ఎంపిక చేశారు. కేరళ నుంచి వచ్చిన వారికి 32 పతకాలు, కర్ణాటక 29, తమిళనాడు 21, ఆంధ్రప్రదేశ్‌ 19, తెలంగాణ నుంచి వచ్చినవారికి 2 పతకాలు, ఇతర రాష్ట్రాల నుంచి ట్రాక్‌-2, ట్రాక్‌-3 కేటగిరీల్లో పాల్గొన్నవారిలో 22 మందికి పతకాలు వచ్చాయి. ప్రాంతీయ పోటీల్లో విజేతలు జనవరిలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని