ఓటీఎస్‌ వసూళ్లపై తీవ్ర ఒత్తిడి..తట్టుకోలేక సెలవుపై వెళ్లిన మున్సిపల్‌ కమిషనర్‌

స్వచ్ఛంద విధానంలో ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తూనే... జిల్లా ఉన్నతాధికారులు నిత్యం వివిధ రూపాల్లో సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారు.

Updated : 09 Jan 2022 08:20 IST

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: స్వచ్ఛంద విధానంలో ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తూనే... జిల్లా ఉన్నతాధికారులు నిత్యం వివిధ రూపాల్లో సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారు. వసూళ్లలో వెనుకబడిన వారిపై తీవ్ర స్థాయిలో మందలింపులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడి తట్టుకోలేక జిల్లాలో తూర్పు ప్రాంతానికి చెందిన ఓ పురపాలక కమిషనరు సెలవుపై వెళ్లినట్లు సమాచారం. మరో కమిషనరు కూడా ఇదే బాటలో ఉన్నారు.

మానసిక ఆందోళనలో పురపాలక సచివాలయ ఉద్యోగులు

గృహ నిర్మాణశాఖ తరఫున కూడా ఉద్యోగులకు లక్ష్యాలు నిర్దేశించి ఒత్తిడి పెంచారు. మీరు తీసుకుంటున్న జీతాలు ఎంత?.. పని ఎంతంటూ? ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పురపాలక పరిధిలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యోగులు మానసికంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నారు. ఈ ఒత్తిళ్లు భరించలేమని... ఈ నెల 10న చేపట్టబోయే మెగా మేళాకు సహకరించబోమంటున్నారు. 1983 నుంచి 2011 వరకు చిత్తూరు జిల్లాలో 4,71,788 మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నట్లు గుర్తించారు. వీరిలో ఓటీఎస్‌ కింద 2,55,586 మంది అర్హత ఉన్నట్లుగా తేల్చడంతో పాటు వీరి నుంచి రూ.219.20 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శుక్రవారం వరకు 66,059 మంది నుంచి రూ.29.66 కోట్లు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు తమపై తీవ్ర ఒత్తిళ్లకు పాల్పడుతున్నట్లు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. మెప్మా నుంచి రుణాలు సక్రమంగా అందడంలేదని, సంక్రాంతి పండుగ తరుణంలో లబ్ధిదారులు చెల్లింపులకు ముందుకు రావడం లేదని వారు చెబుతున్నారు. ఈ తరుణంలో తమపై ఒత్తిడి పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని