
ఆక్రమణల నుంచి కొల్లేరు సరస్సును రక్షిస్తున్నాం
ఎన్జీటీకి ప.గో. కలెక్టర్ నివేదిక
ఈనాడు, అమరావతి: ‘కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఆక్వా సాగు చేయకుండా, ఆక్రమణలు జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. గత 15 ఏళ్లలో 15,742 ఎకరాలకు సంబంధించి 554 కేసులు నమోదు చేశాం’ అని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్ర జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై ధర్మాసనానికి నివేదిక సమర్పించారు. కొల్లేరు కాలుష్యంతో ప్రజలు ఏలూరు తదితర చోట్ల అంతు చిక్కని వ్యాధుల బారిన పడుతున్నారని ఎన్జీటీకి అందిన వాట్సప్ ఫిర్యాదును కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టింది. కొల్లేరు పరిస్థితులపై జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. స్పందించిన కలెక్టర్ మిశ్ర నివేదిక సమర్పించారు. అందులోని వివరాలు..
* సుప్రీంకోర్టు సాధికార కమిటీ సూచనల మేరకు కొల్లేరులో ఉన్న ఆక్రమణలను 2006 జూన్ 15 నాటికే ప్రభుత్వ యంత్రాంగం తొలగించింది. తర్వాత +5 కాంటూరు పరిధిలోని 33,987.35 హెక్టార్లు అటవీశాఖకు రెవెన్యూశాఖ అప్పగించింది. తర్వాత +3 కాంటూరుకు అభయారణ్యాన్ని పరిమితం చేయాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది. ఈ హద్దులు మార్చే అంశం వన్యప్రాణుల జాతీయ బోర్డు పరిధిలో ఉంది.
* ఆక్రమణల నివారణకు అటవీశాఖ 6 చెక్‌పోస్టులు, 5 బేస్ క్యాంపులు ఏర్పాటు చేసింది. సరస్సులోకి వ్యర్థాలు రాకుండా చూస్తున్నాం. పక్షుల సంరక్షణతో పాటు ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామ’ని వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.