
తిరుమలలో ఏకాంతంగా పార్వేట ఉత్సవం
తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ఏటా కనుమ పండుగనాడు నిర్వహించే ఈ వేడుకలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం మూడు నుంచి 4.30 గంటల వరకు శ్రీమలయప్పస్వామి, శ్రీకృష్ణుడిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి కల్యాణ మండపంలో కొలువుదీర్చారు. ఆస్థానం అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి, హరికథ పారాయణం చేశారు. తితిదే ఉద్యాన శాఖ క్రూర జంతువులు, అడవిని ప్రతిబింబించేలా అలంకరించిన సెట్టింగ్‌లో పార్వేట వేడుక నిర్వహించారు. అర్చకులు మూడుసార్లు స్వామివారి తరఫున ఈటెను విసిరి వేటను రక్తి కట్టించారు. సాయంత్రం స్వామివార్లు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.