సైబర్‌ నేరాల కట్టడికి పటిష్ఠ వ్యూహం

సైబర్‌, సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో సైబర్‌ సెల్‌, సామాజిక మాధ్యమ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. ఒక్కో దాంట్లో బీటెక్‌ అర్హతతో సాంకేతిక పరిజ్ఞానమున్న

Published : 18 Jan 2022 05:41 IST

జిల్లాకో సైబర్‌ సెల్‌, సామాజిక మాధ్యమ ల్యాబ్‌
రాష్ట్రవ్యాప్తంగా 1,551 మంది
సైబర్‌ నేరస్థులను గుర్తించాం
డీజీపీ గౌతం సవాంగ్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: సైబర్‌, సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో సైబర్‌ సెల్‌, సామాజిక మాధ్యమ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. ఒక్కో దాంట్లో బీటెక్‌ అర్హతతో సాంకేతిక పరిజ్ఞానమున్న ఒక ఎస్‌ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లను నియమించనున్నారు. ఈ మేరకు మొత్తం 20 వేల మందిని ఎంపిక చేసి, శిక్షణ ఇస్తారు. తొలివిడతలో విజయనగరం, ఒంగోలు, అనంతపురం జిల్లాల్లోని పోలీసు శిక్షణ కేంద్రాల్లో వంద మందికి చొప్పున ఇవ్వనున్న శిక్షణను సోమవారం డీజీపీ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘సైబర్‌ సెల్‌, సామాజిక మాధ్యమ ల్యాబ్‌ల ఏర్పాటుతో సైబర్‌ నేరాలపై దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. అవసరమైన అన్ని సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను అందుబాటులో ఉంచడంతో నేరస్థులను తేలికగా గుర్తించవచ్చు. జిల్లా స్థాయిలో డిజిటల్‌ సాక్ష్యాధారాలు, సామాజిక మాధ్యమ పోస్టుల గుర్తింపు వంటి వాటితో నిందితులను న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టి, బాధితులకు సత్వర న్యాయం అందించవచ్చు. త్వరలో ప్రతి జిల్లాకు సాంకేతికపరంగా న్యాయ సలహాల కోసం సైబర్‌ లీగల్‌ సలహాదారులు, సైబర్‌ నిపుణులను నియమించనున్నాం. జిల్లాస్థాయి సెల్‌, ల్యాబ్‌కు అనుసంధానంగా రాష్ట్ర స్థాయిలోనూ ఏర్పాటు చేస్తాం. దీనికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి కేంద్రాల ద్వారా జిల్లాస్థాయి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు కేసుల దర్యాప్తులో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారాలు చూపుతారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 1,551 మంది ప్రొఫైల్‌లను గుర్తించి, వారందరిపైన సైబర్‌ బుల్లీ షీట్లు తెరవడంతోపాటు ప్రతి క్షణం వారి కదలికలపై నిఘా కొనసాగిస్తున్నాం’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని