ఎంపీ సాక్షిగా చెప్పుతో కొట్టడానికొచ్చారు

గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యక్తిగత సహాయకుడిపై హత్యాయత్నం కేసులో అరెస్టయి సబ్‌జైలులో ఉన్న రైతు గడిపూడి నరేంద్ర మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు. వినుకొండ సబ్‌జైలు వద్ద ఏపీ రైతు సంఘ నేతలు

Published : 19 Jan 2022 04:47 IST

జైలు నుంచి విడుదలైన రైతు నరేంద్ర వ్యాఖ్య

వినుకొండ, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వ్యక్తిగత సహాయకుడిపై హత్యాయత్నం కేసులో అరెస్టయి సబ్‌జైలులో ఉన్న రైతు గడిపూడి నరేంద్ర మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు. వినుకొండ సబ్‌జైలు వద్ద ఏపీ రైతు సంఘ నేతలు పూలమాల వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరేంద్ర విలేకర్లతో మాట్లాడారు. ధాన్యానికి గిట్టుబాటు ధర గురించి శావల్యాపురం మండలం వేల్పూరుకు వచ్చిన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు చెబుతుంటే వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనపై చెప్పు తీసుకొని కొట్టడానికి వచ్చారని తెలిపారు. దీనిపై దేవుడి వద్ద ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని అన్నారు. నాటి ఘటనకు ఎంపీ ప్రత్యక్ష సాక్షి అని చెప్పారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడి ముఖం ఇంతవరకు తాను చూడలేదని.. కావాలని తనపై హత్యాయత్నం కేసు పెట్టారని, ఎమ్మెల్యే వల్ల తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. వైఎస్‌ హయాంలో తాను పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా పనిచేశానని, ఇడుపులపాయలో జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరినప్పటినుంచి పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్నానని చెప్పారు. తనకు తెదేపాతో సంబంధాలున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తప్పు చేయకపోయినా 12 రోజులు జైల్లో ఉన్న తన కోసం ఆందోళనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని