ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ వైద్యసేవలు

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నందున ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వైద్యసేవలను తిరిగి ప్రారంభించినట్లు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. బుధవారం నుంచి రోజు ఉదయం 7 గంటలకు జూమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో

Published : 20 Jan 2022 05:40 IST

నిపుణులతో వైద్య బృందాలు,  జూమ్‌ ద్వారా సలహాలు
మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నందున ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వైద్యసేవలను తిరిగి ప్రారంభించినట్లు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. బుధవారం నుంచి రోజు ఉదయం 7 గంటలకు జూమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కొవిడ్‌ రోగులకు నిపుణుల ఆధ్వర్యంలో వైద్య సలహాలు అందిస్తున్నామని చెప్పారు. ‘24 గంటలు పనిచేసే కాల్‌సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. రోగులకు అవసరమైన మందులు, మెడికల్‌ కిట్లను ట్రస్ట్‌ ప్రతినిధుల ద్వారా జిల్లాలవారీగా పంపిణీ చేస్తున్నాం. గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను కూడా సిద్ధం చేశాం...’ అని ఆమె వివరించారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మందులు, వైద్య పరికరాలు, ఇతర సహాయంపై భువనేశ్వరి బుధవారం సమీక్షించారు. ‘కొవిడ్‌ బాధితులకు టెలిమెడిసిన్‌ సేవలను అందించేందుకు ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు లోకేశ్వరరావుతో పాటు రాష్ట్రంలోని నిపుణులతో వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశాం. జూమ్‌ కాల్‌ ద్వారా నేరుగా వైద్యులతో మాట్లాడే సౌకర్యం ఉంది’ అని ఆమె పేర్కొన్నారు.  

రెండు రాష్ట్రాల్లో మూడు చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లు

రెండు రాష్ట్రాల్లో మూడు చోట్ల ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని భువనేశ్వరి తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు కుప్పంలో ప్లాంటును ప్రారంభించారన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా గూడూరులో ప్లాంట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. గతేడాది కొవిడ్‌ సమయంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.1.75 కోట్ల విలువైన మందులు, ఆహారం, వైద్య పరికరాలను అందించామన్నారు. వరదలకు ప్రాణాలు కోల్పోయిన 48 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించామని ఆమె వివరించారు.


కుప్పంలో నేడు టెలిమెడిసిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు

కుప్పం: కుప్పం నియోజకవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం ఉదయం 7:30 గంటలకు టెలిమెడిసిన్‌ కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారు. పీహెచ్‌సీల్లో ట్రస్టు తరఫున వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు మందులు, వైద్యసేవలను అందిస్తారు. వివరాలకు చరవాణి నంబరు 73821 73723కు సంప్రదించాలని స్థానిక తెదేపా కార్యాలయం ఒక ప్రకటనలో సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని