ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమే సంక్షోభానికి మూలం

రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, మితిమీరిన సంక్షేమ పథకాలు, అనేక అనాలోచిత నిర్ణయాలే ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి కారణమని ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్స్‌ ఫోరం

Published : 23 Jan 2022 04:53 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, మితిమీరిన సంక్షేమ పథకాలు, అనేక అనాలోచిత నిర్ణయాలే ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి కారణమని ఆంధ్రప్రదేశ్‌ ప్రొఫెషనల్స్‌ ఫోరం (ఏపీపీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పవృక్షం లాంటి అమరావతిని ఆపడంతో ఆదాయం తగ్గి ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ‘‘ఎన్నికలకు ముందు ఓట్ల కోసం అలవికాని హామీలిచ్చారు. తీరా అవి నెరవేర్చాల్సి వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి బాగాలేదనడం దుర్మార్గం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా? ప్రస్తుతం రాష్ట్రంలో చాలీచాలని జీతాలతో ఉద్యోగులు... గిట్టుబాటు ధరలేక రైతులు... ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక కార్మికులు, విద్యార్థులు వలసపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై శ్రద్ధ పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని ఆరోపించే బదులు కేంద్రమే కలగచేసుకొని పరిస్థితులను చక్కబెట్టాలి. అవసరమైతే రాష్ట్రంలో ఆర్థిక అత్యయిక పరిస్థితి విధించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది సలహాదారులు అవసరమా? అభివృద్ధి కోసం ఒక్క రూపాయ అయినా ఖర్చుపెట్టారా? అభివృద్ధి లేకుండా ఆదాయం పెరగదు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, రాజధానికి నిధులు, కోస్టల్‌ కారిడార్‌, పోలవరం, తదితర హామీలను నెరవేర్చి ఉంటే రాష్ట్ర ఆదాయం పెరిగేది. కేంద్రం ధోరణి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ అనే రాష్ట్రం దేశంలో ఉన్నట్లు మర్చిపోయినట్లనిపిస్తోంది. రాష్ట్రానికి నిధులివ్వాలి, అభివృద్ధి వైపు మళ్లేలా నియంత్రించాలి. పెరుగుతున్న ధరలకు తగ్గట్లు తమ జీతాలు పెంచాలనే ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. రాష్ట్రం సొంత ఆదాయం కన్నా ఉద్యోగుల జీతాలే ఎక్కువగా ఉన్నాయని  చెబుతోంది. ఎన్నికల సమయంలో అనాలోచితంగా హామీలిచ్చినప్పుడు ఈ విషయం గుర్తు లేదా? ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో చర్చించాలి. అందరూ కలిసికట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై పోరాడాలి...’’ అని మహేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీపీఎఫ్‌ సంయుక్త కార్యదర్శి పి.ఖాజారావ్‌, కార్యదర్శి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని