మాతృభాషలో వాదన న్యాయస్థానాన్ని అవమానించినట్లు కాదు: హైకోర్టు

హైకోర్టులో వాదనలు ఆంగ్లంలో జరుగుతున్నప్పటికీ.. ప్రాంతీయ భాష/మాతృభాషలో వాదించడం కోర్టు విచారణను అవమానించడం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన

Published : 23 Jan 2022 04:57 IST

ఈనాడు, అమరావతి: హైకోర్టులో వాదనలు ఆంగ్లంలో జరుగుతున్నప్పటికీ.. ప్రాంతీయ భాష/మాతృభాషలో వాదించడం కోర్టు విచారణను అవమానించడం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. విశాఖలో ఓ భవన నిర్మాణ అనుమతుల వ్యవహారంలో విశాఖపట్నం అగనంపూడికి చెందిన వ్యాపారి జి.భాస్కరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వ్యాజ్యం విచారణార్హతపై సింగిల్‌ జడ్జి.. పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఆంగ్లంలో ప్రశ్నించారు. న్యాయవాది తెలుగులో సమాధానమిచ్చారు. దీంతో న్యాయమూర్తి.. పిటిషనర్‌కు రూ.25వేలు ఖర్చులు విధించారు. హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి 4వారాల్లో ఈ మొత్తం చెల్లించాలని ఆదేశిస్తూ 2019 మార్చి 12న ఉత్తర్వులిచ్చారు. పిటిషన్‌ను కొట్టివేశారు. సింగిల్‌జడ్జి ఉత్తర్వులపై భాస్కరరావు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. అప్పీల్‌ను కొనసాగించాలనే ఉద్దేశం తమకు లేదని, అయితే సింగిల్‌జడ్జి జస్టిస్‌ గంగారావు రూ.25వేల ఖర్చులను విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని విన్నవించారు. రూ.25వేలు ఎందుకు విధించారని ధర్మాసనం ప్రశ్నించింది. తెలుగులో సమాధానం చెప్పినందుకని న్యాయవాది బదులిచ్చారు. అప్పీల్‌ లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరినందున వెళ్లడం లేదని ధర్మాసనం పేర్కొంది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను పరిశీలిస్తే.. న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు న్యాయవాది కోర్టు విచారణను అవమానించేలా తెలుగులో దృఢం (స్టౌట్‌)గా వాదించారని పేర్కొంది. కోర్టు అడిగిన ప్రశ్నకు తెలుగులో న్యాయవాది సమాధానం ఇచ్చినట్లుందని తెలిపింది. అంతే తప్ప కేసు మొత్తాన్ని తెలుగులో వాదించలేదని పేర్కొంది. ఏదైనప్పటికీ.. హైకోర్టులో ఆంగ్ల భాష వినియోగిస్తున్నప్పటికీ మాతృభాషలో వాదించడం హైకోర్టు విచారణను అవమానించడంగా చెప్పలేమని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని