ముగ్గురు అధికారుల సస్పెన్షన్‌ ఎత్తివేతపై సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల రద్దు

దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ పెండింగ్‌లో ఉన్న ముగ్గురు అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం తప్పుబట్టింది. ఆ

Updated : 23 Jan 2022 05:03 IST

తీర్పు వెల్లడించిన ధర్మాసనం

ఈనాడు, అమరావతి: దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణ పెండింగ్‌లో ఉన్న ముగ్గురు అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం తప్పుబట్టింది. ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఉద్యోగి దుష్ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు ఉన్నప్పుడు విధుల్లో కొనసాగడానికి వీల్లేదని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది. సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతించింది. ఆ ముగ్గురు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్‌ను కొనసాగించడాన్ని సమర్థించింది.  ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధన 8 ప్రకారం పిటిషనర్లను సస్పెన్షన్‌ చేయడానికి గల కారణం సర్వే విధి నిర్వహణలో వారు అంకితభావం చూపలేదని పేర్కొంది. పిటిషనర్లు ఇచ్చిన నివేదికతో వ్యత్యాసం ఉన్న ఖనిజం వ్యవహారంలో లీజుదారునికి ప్రభుత్వం పెనాల్టీ వేయలేకపోయిందని తెలిపింది.  ఖజానాకు రూ.215 కోట్ల తీవ్ర నష్టం కలిగిందని పేర్కొంది. ఈ తరహా చర్య దుష్ప్రవర్తన కిందకు వస్తుందని తెలిపింది. పిటిషనర్ల సస్పెన్షన్‌ పొడిగింపును సింగిల్‌ జడ్జి ఎత్తి వేయడం సరికాదని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం లింగాలవలసలో ఎంఎస్‌పీ గ్రానైట్స్‌ సంస్థ 1.45 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర ఖనిజాన్ని తవ్వి తీసిందని గనులశాఖ అసిస్టెంట్‌ మైన్స్‌ అధికారులు పి.ఆనందరావు, మద్దెల వెంకటేసు, సర్వేయరు కె.శ్రీధర్‌ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అంతకు ముందు సర్వే నిర్వహించిన మరో బృందం 4.18 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేరకు తవ్వకాలు జరిపినట్లు పేర్కొంది. ఈ రెండు నివేదికలను పరిశీలించిన ప్రభుత్వం ఈ ముగ్గురు అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చారని భావించి సస్పెండ్‌ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఆ ముగ్గురూ హైకోర్టును ఆశ్రయించగా.. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం ధర్మాసనానికి అప్పీల్‌ చేయడంతో సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని