అశుతోష్‌మిశ్ర నివేదిక బయటపెట్టాల్సిందే

పీఆర్సీ జీవోలను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాతే చర్చలకు వెళతామని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు స్పష్టంచేశారు. అశుతోష్‌మిశ్ర కమిటీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులకు కావాలనే అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

Published : 26 Jan 2022 04:50 IST

రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ర్యాలీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పీఆర్సీ జీవోలను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాతే చర్చలకు వెళతామని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు స్పష్టంచేశారు. అశుతోష్‌మిశ్ర కమిటీ నివేదికను బయటపెట్టకుండా ఉద్యోగులకు కావాలనే అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన ఉద్యోగులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్రదర్శన నిర్వహించారు. వివిధ డిమాండ్లు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అదనపు కార్యదర్శి కత్తి రమేశ్‌ మాట్లాడుతూ... ‘జీతాలు వేయకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కొన్ని శాఖల ఉన్నతాధికారులు ఎస్‌వోల మీద తీవ్ర ఒత్తిడి తేవడం తగదు. ఉద్యోగులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాష్ట్ర ఉద్యోగులందరి సమస్య. అందరం ఉమ్మడిగా ఏకతాటిపై నిల్చుని పోరాడితేనే డిమాండ్లను సాధించగలం’ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గెజిటెడ్‌ అధికారుల ఐకాస ఛైర్మన్‌ కృష్ణయ్య మాట్లాడుతూ... సీఎస్‌ ఆధ్వర్యంలోని కమిటీకి చట్టబద్ధత లేదని, అందుకే అశుతోష్‌మిశ్ర కమిటి నివేదికను బయటపెట్టాలని కోరుతున్నట్లు స్పష్టంచేశారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ ఈసీ సభ్యులు రామారావు మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకొచ్చిన అధికారుల కమిటీతో ఏ ఒక్క ఉద్యోగికి ఏ ఒక్క అంశంలోనూ ఉపయోగం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని