Andhra News: ద్వారంపూడి గోదాములకు పన్ను రాయితీ

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబానికి చెందిన గోదాములకు ఆస్తి పన్నులో రాయితీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇదే తరహా రాయితీలు ప్రజలకూ ఇవ్వాలంటూ తెదేపా ఇటీవల నగరపాలక

Published : 23 Mar 2022 07:56 IST

 రెండేళ్లలో రూ.9,73,790 మేలు

ఇతర సంస్థల విజ్ఞప్తుల తిరస్కరణ

ఈనాడు-కాకినాడ, న్యూస్‌టుడే-కాకినాడ కలెక్టరేట్‌: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబానికి చెందిన గోదాములకు ఆస్తి పన్నులో రాయితీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇదే తరహా రాయితీలు ప్రజలకూ ఇవ్వాలంటూ తెదేపా ఇటీవల నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వేకెన్సీ రెమిషన్‌ కింద పన్నులో 50 శాతం మినహాయింపును ఎమ్మెల్యే కుటుంబం నిబంధనల ప్రకారమే పొందిందని కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ తరహా రాయితీ ఒక్క కుటుంబానికే దక్కడం గమనార్హం. కాకినాడకు చెందిన శ్రీకాంప్లెక్స్‌, జగన్నాథపురంలోని గాంధీ సెంటినరీ స్కూలు యాజమాన్యాలు వేకెన్సీ రెమిషన్‌కు దరఖాస్తు చేసినా పాతబకాయిలు, సాంకేతిక కారణాలతో కార్పొరేషన్‌ వాటిని తిరస్కరించింది.

రాయితీ పొందారిలా!

బీచ్‌రోడ్డులోని దుమ్మలపేటలో ఎమ్మెల్యే తండ్రి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ ద్వారంపూడి భాస్కరరెడ్డి పేరిట రెండు గోదాములు, తల్లి పద్మావతి పేరిట ఐదు గోదాములు ఉన్నాయి. ఇవి ఖాళీగా ఉన్నందున వేకెన్సీ రెమిషన్‌ కింద రాయితీ ఇప్పించాలని దరఖాస్తు చేయడంతో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏడు గోదాములకు పన్ను రూ.10,02,558 చెల్లించాల్సి ఉంటే రూ.5,01,279 రాయితీ ఇచ్చారు. 2020-21లో ఆరు గోదాములకు మొత్తం పన్ను రూ.9,45,022కుగానూ రూ.4,72,511 రాయితీ ఇచ్చారు. మొత్తంగా రెండేళ్లలో రూ.9,73,790 రాయితీ లభించింది. దీనిపై కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా అప్పటి మేయర్‌ సుంకర పావని హయాంలో ఆమోదించారు. వేకెన్సీ రెమిషన్‌కు కౌన్సిల్‌ తీర్మానంతో పని లేదని, స్టాండింగ్‌ కమిటీ ఆమోదం చాలని అధికారులు చెబుతున్నారు.

అర్హత ఉంటే ఎవరైనా రాయితీ పొందొచ్చు

గోదాములు, వ్యాపార దుకాణాలు, ఇళ్లు.. ఇలా ఏవి ఖాళీగా ఉన్నా రాయితీ పొందేందుకు కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పాత, ప్రస్తుత సంవత్సరాల పన్ను బకాయిలు ఉండకూడదు. ఏపీ మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ చట్టం-1955 సెక్షన్‌ 232 ప్రకారం 50 శాతం వేకెన్సీ రెమిషన్‌ (తిరిగి చెల్లించాల్సిన మొత్తం) చెల్లిస్తాం. గోదాములు ఖాళీగా ఉన్నాయా లేవా అన్నది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, డిప్యూటీ కమిషనర్‌ సంయుక్తంగా తనిఖీ చేస్తారు. ఖాళీగా ఉన్నాయని నిర్ధారించాకే స్టాండింగ్‌ కమిటీ ఆమోదానికి ప్రతిపాదిస్తారు. ఆ తర్వాతే చెల్లింపులు జరుగుతాయి.

- స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని